అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి మద్దతు ప్రకటించిన సుమలత

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మండ్యకు చెందిన ఇండిపెండెంట్ లోక్ సభ సభ్యురాలు, ప్రముఖ నటి సుమలత బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోదీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె శుక్రవారం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతు బీజేపీకే ఉంటుందని చెప్పారు.
సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సుమలత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నుంచి బీజేపీకే తన మద్దతు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.  మండ్య చాముండేశ్వరి నగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, ఓ సగటు భారతీయుడు తల ఎత్తుకునేలా మోదీ పరిపాలన సాగిస్తోన్నారని ఆమె ప్రశంసలు కురిపించారు.

”ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నా సంపూర్ణ మద్దతు బీజేపీకే ఉంటుంది. మాండ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. నా నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుని రిస్క్‌ చేసి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాను” అని సుమలత అంబరీష్ తెలిపారు.

అయితే, సాంకేతికంగా అధికారికంగా ఇప్పుడే ఆమె బీజేపీలో చేరేందుకు ఆమె లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉపఎన్నికలకు సిద్ధం కావలసి ఉంటుంది. అందుచేత బీజేపీలో చేరకపోయినా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయవచ్చని సంకేతం ఇచ్చారు.
 
2019 నాటి లోక్ సభ ఎన్నికల్లో తనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం తాను స్వతంత్ర ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ మండ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు.
 
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుమలత పలు విడతలు చర్చలు జరిపినట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారంనాడు తెలియజేసిన నేపథ్యంలో బీజేపీకే తన మద్దతు ఉంటుందని సుమలతా అంబరీష్ ప్రకటించారు. దీనికితోడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న మాండ్యలో పర్యటించి, రోడ్ షోలో పాల్గొంటున్న నేపథ్యంలో దీనికి రెండు రోజుల ముందే సుమలత తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
బలాబలాల పరంగా చూసినప్పుడు, మాండ్య నియోకవర్గం జేడీఎస్ కు కంటుకోటగా ఉంది. 2018 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని మొత్తం 7 సీట్లలోనూ జేడీఎస్ గెలుపొందింది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నియోజవర్గం నుంచి సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందడం ద్వారా జేడీఎస్‌కు షాకిచ్చారు.
 
స్వచ్ఛమైన రాజకీయాలను బీజేపీ మాత్రమే చేయగలుగుతుందని, దేశాభివృద్ధిని కాంక్షించేది అదొక్క పార్టీయేనని తేల్చి చెప్పారు. అందుకే తాను మోదీ నేతృత్వంలోని బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని చెప్పడం ద్వారా 2024 ఎన్నికలలో తాను బిజెపి అభ్యర్థిగా పోటీచేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
 
బీజేపీలో చేరబోతోన్నారంటూ వస్తోన్న వార్తలపైనా సుమలత స్పందిస్తూ ప్రస్తుతం తాను బీజేపీలో చేరట్లేదని, దానికి ఇంకా సమయం ఉందని చెప్పడం గమనార్హం. బీజేపీలో చేరితే.. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు రావొచ్చని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పారు. అందుకే సరైన సమయంలో బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు.
 
కాగా, తన కుమారుడు, కన్నడ నటుడు అభిషేక్ అంబరీష్ కు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సీట్ ఇవ్వాలని తాను కోరుతున్నట్లు వస్తున్న కథనాలను ఆమె కొట్టిపారవేసారు. తన కుమారుడు ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడనీ సుమలత తేల్చిచెప్పారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించే ఉద్దేశంతో సుమలత ఉన్నారని తెలుస్తోంది.
 
మండ్య, మద్దూరు, శ్రీరంగపట్టణం వంటి కీలక నియోజకవర్గాల్లో తన ఆప్తులకు టికెట్లను కేటాయించాలంటూ గురువారమే ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా, ఆమె బీజేపీలో చేరే విషయమై ఆమె శుక్రవారం ఒక ప్రకటన చేయబోతున్నారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురువారమే ప్రకటించారు.