పవన్ నాయక్, ప్రీతి హంతకులను అరెస్ట్ చేయాలి

భాగ్యనగర్ సమీపంలోని బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి పవన్ నాయక్ ను హత్య చేసిన దుండగులతో పాటు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో హత్యకు గురైన ప్రీతి హంతకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.  గిరిజనులు, దళితులను వివిధ రంగాలలో పనిచేస్తున్న హిందువులను టార్గెట్ చేసుకొని దుండగులు హత్యలకు పాల్పడుతున్నారని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ని కలిసి పరిషత్ నేతలు వినతి పత్రం సమర్పించారు.  సానుకూలంగా స్పందించిన డిజిపి దోషులను వెంటనే పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా దోషులకు వంత పాడుతూ నిందితులను రక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు చర్యలకు పాల్పడుతుందని, ఈ విషయంలో కూడా దృష్టి సారించాలని డిజిపిని వీహెచ్‌పీ నేతలు వివరించారు.
 
భాగ్యనగరంలో రోహింగ్యా ముస్లింల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన డిజిపి కొత్తగా వచ్చిన రోహింగ్యాల వివరాలు ఇస్తే వారిపై చర్లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా వీహెచ్‌పీ నేత పగుడాకుల బాలస్వామిని టార్గెట్ చేసిన రాచకొండ కమిషనర్ హెచ్చరిక ఇవ్వడం విషయంలో డిజిపి సీరియస్ గా స్పందించారు.
 
రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే పోలీసులు చాలామంది ఉన్నారని, వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా హత్యకు గురైన పవన్ నాయక్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
 
పోలీసుల తీరు మారకపోతే, రోజురోజుకు హిందువులపై దాడులు ఇలాగే కొనసాగితే  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, ప్రచార సహ ప్రముఖ్ అనిల్ పాల్గొన్నారు.