సిసోడియాను జైల్లోనే అరెస్ట్ చేసిన ఈడీ

ఆప్ కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి  మనీష్ సిసోడియాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లోనే ఉన్న ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. గత నెల 27న ఆయనను సిబిఐ అరెస్ట్ తీహార్ జైలుకు తరలించింది. ఇప్పుడు లిక్కర్ స్కాంలో డబ్బుల లావాదేవీల అంశంలో విచారణ చేస్తున్న ఈడీ తన పరిధిలోని కేసు విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసింది. 

మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సిసోడియాను సీబీఐ గత నెల అరెస్ట్‌ చేయగా తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి హవాలాకు పాల్పడ్డారంటూ ఈడీ ఆయనను మంగళవారం జైలులో ఐదు గంటల పాటు ప్రశ్నించింది. గురువారం కూడా కొద్దిసేపు ప్రశ్నించిన ఈడీ.. సిసోడియాను అరెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

లిక్కర్ స్కాంలో డబ్బులు ఎలా చేతులు మారాయి? ఎవరెవరి దగ్గర నుంచి ఏ రూపంలో వచ్చాయి? అనే విషయాలపై ఆరా తీశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇప్పటికే అరెస్ట్ అయిన 11 మంది నిందితులతోపాటు 11వ తేదీన విచారణ చేయబోతున్న ఎమ్మెల్సీ కవిత కలిపి విచారణ చేయటానికి అనుగుణంగానే ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

తీహార్ జైల్లోనే ఉన్న  సిసోడియాను తమ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 27వ తేదీన సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఆయన ఇప్పటికే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మార్చి 10వ తేదీన విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ విచారణకు వస్తున్న కొన్ని గంటల ముందే సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.

అంతకు ముందు తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సిసోడియా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపి సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకు వెళ్లాలని కోర్ట్ సూచించింది.