గుజరాత్‌లో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించనున్న నాఫెడ్‌

జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంస్థ అయిన నాఫెడ్, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గుజరాత్‌లో ఉల్లి కొనుగోళ్లు చేపట్టనుంది. ఆ రాష్ట్రంలో ఉల్లి పంట ధరలు తగ్గుతుండడంతో, ఈ సమస్యను పరిష్కరించడానికి ఖరీఫ్ ఉల్లి సేకరణను నాఫెడ్‌ ప్రారంభించనుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో, గుజరాత్‌ ఉల్లి మార్కెట్‌లో స్థిరత్వం వస్తుంది.

ఖరీఫ్ సీజన్ చివరిలో గుజరాత్‌ రాష్ట్రంలో ఉల్లి ధరలు క్షీణించడంతో, పరిస్థితిని సమీక్షించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం, గుజరాత్‌లోని మూడు ప్రధాన మార్కెట్ల నుంచి ఉల్లి పంట సేకరణను ప్రారంభించాలని నాఫెడ్‌ని ఆదేశించింది. భావ్‌నగర్ (మహువా), గొందల్, పోర్‌బందర్‌ మార్కెట్లలో గురువారం నుంచి ఉల్లిపాయల సేకరణను నాఫెడ్‌ ప్రారంభిస్తుంది.

గుజరాత్‌లో ఉల్లి ధరల పతనం నుంచి రైతులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. రైతులు తమ వద్ద ఉన్న నాణ్యమైన, ఆరిన ఉల్లి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఈ కేంద్రాల్లో మెరుగైన ధరను పొందాలని అధికారులు సూచించారు. రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అవసరమైతే మరిన్ని సేకరణ కేంద్రాలను తెరుస్తారు.