మహిళలు, బాలికలపై ఉగ్రవాదుల హింస పట్ల భారత్ ఆందోళన

మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస అధికంగా ఉదని భారత్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హింసను తీవ్రంగా ఖండించాలని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న జీరో టోలరెన్స్‌ విధానం అవలంభించాలని స్పష్టం చేసింది.

ఐక్యరాజ్యసమితిలో భారత శాస్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్‌ 25వ వార్షికోత్సవం  సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను ఉల్లంఘిస్తున్నాయని, ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా మారుతున్నాయని తెలిపారు.

దీంతో మహిళలు బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. అన్ని రకాల ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో ”మహిళల శాంతి భద్రత”లపై భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది.

 సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందనల్లో మహిళల పాత్రను ఈ తీర్మానం పునరుద్ఘాటిస్తోంది. అలాగే సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతల్లో  మహిళల ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.

అటువంటి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన సూత్రాలు తప్పనిసరని  రుచిరా కాంబోజ్‌ తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌ పరిస్థితిని ప్రస్తావిస్తూ  ఆగస్టు 2021లో భారత్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యుఎన్‌ఎస్‌సి తీర్మానం 2593 ప్రకారం అప్ఘనిస్తాన్‌లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిధ్య పాలన ప్రాముఖ్యతను పేర్కొన్నారు.

అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షర్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయ సంస్థలకు సాయం చేయాలని ఆమె చెప్పారు. సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలని, శాంతి స్థాపన ప్రయత్నాలలో మహిళలపై  దృష్టి  పెట్టడం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.

వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారని రుచిరా కాంబోజ్‌ చెప్పారు.  భారత్‌లో  లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నామని ఆమె చెప్పారు. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు  ఇప్పటికీ తక్కువగానే  ప్రాతినిధ్యం వహించడం బాధకరమని ఆమె తెలిపారు.