మహిళలకు అత్యంత అణచివేత దేశం ఆఫ్గనిస్తాన్

 
మహిళల, బాలికల హక్కులను కాలరాస్తూ తాలిబన్‌ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్‌ ”ప్రపంచంలో అత్యంత అణచివేత దేశం” గా నిలిచిందని ఐక్యరాజ్యసమితి బుధవారం ప్రకటించింది. ఆఫ్ఘన్‌ మహిళలను రక్షించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ మీడియా సాక్షిగా బుధవారం కాబూల్‌ వీధిలో సుమారు 20 మంది మహిళలు ప్రదర్శన నిర్వహించారు.
 
మహిళలు, బాలికలపై గృహనిర్బంధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘన్‌ను చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబన్‌ ప్రభుత్వం ఇస్లాం మతం పేరుతో మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.  ఆప్ఘన్‌ మహిళలు, బాలికలు బయటకు రాకుండా తాలిబన్‌లు పద్ధతి ప్రకారం, ఉద్దేశపూర్వకంగా, క్రమబద్ధంగా చేపడుతున్న చర్యలు బాధకలిగిస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐరాస మిషన్‌ హెడ్‌ రోజా ఒటున్‌బయేవా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ఆఫ్ఘనిస్తాన్‌ ప్రపంచంలోని అతిపెద్ద మానవతా, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ అణచివేత చర్యలు ఆ దేశాన్నే ప్రమాదంలోకి నెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 80 శాతం మంది పాఠశాల వయస్సు గల బాలికలు, యువతులు మొత్తంగా 2.5 మిలియన్ల మంది పాఠశాల విద్యకు దూరమయ్యారని యునెస్కో తెలిపింది.