మెడికల్ కాలేజీలకై ప్రతిపాదనలు పంపని తెలంగాణ

తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలల కేటాయింపు విషయమై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య, బిజెపి – బిఆర్ఎస్ నేతల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. చివరకు ఈ విషయంలో గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను సహితం లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.
 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విడతల వారీగా మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం కనీసం ఒక్క కళాశాల కూడా ఇవ్వకుండా, రాష్ట్రంపై వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ మంత్రులు విమర్శిస్తున్నారు. అయితే, పీఎంఎస్ ఎస్ వై స్కీం కింద వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమయానికి దరఖాస్తులు పంపలేదని, మంజూరు చేయకపోవడానికి అదే కారణం అంటూ గతంలో పార్లమెంట్ వేదకగా కేంద్రం ప్రకటించింది.
 
తాజాగా, ఇదే అంశంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై, మంత్రి హరీశ్ రావు మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, పీఎంఎస్ ఎస్ వై స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు కేటాయించారంటూ ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం ఇచ్చింది.
 
పీఎంఎస్ ఎస్ వై మొదటి మూడు విడతల్లో  తెలంగాణ ప్రభుత్వం ఎన్ని మెడికల్ కళాశాలలు, ఏ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిందో తెలపాలంటూ కోరగా మూడు విడతల్లో దేశవ్యాప్తంగా 157 కళాశాలలు మంజూరు చేశామని కేంద్రం బదులిచ్చింది. ఏ దశలోనూ తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదని ఆర్టీఐ ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
 
నాలుగో దశ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాలుగో విడత ఇంకా ప్రారంభించలేదని, రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియజేయాలని రవికుమార్ కోరారు. మెడికల్ కాలేజీల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.