గోదావరి- కావేరి నదుల అనుసంధానంకు తెలుగు రాష్ట్రాల ఆమోదం

ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు నికర జలాలకు నష్టం జరగకుండా ఉంటే గోదావరి- కావేరి నదుల అనుసంధానానికి తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపాయి. దేశంలో నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో నిజలసౌధలో జరిగింది.

నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడిఎ) డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌ సింగ్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల అధికారులు, సిడబ్ల్యుసి, కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు హాజరయ్యారు.  టాస్క్‌ఫోర్స్‌ కమిటీ గుర్తించిన 30 లింకు ప్రాజెక్టుల్లో ఫ్రధానమైన గోదావరి-కృష్ణా-పెను-కావేరీ, పర్బతి-కలిసిండ్‌-చంబల్‌ ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. నదుల అనుసంధానం ఆవశ్యకతను టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ శ్రీరామ్‌ వెదిరె వివరించారు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా(నాగార్జున సాగర్‌), కృష్ణా(నాగార్జున సాగర్‌) – పెనాుర్‌ (సోమశిల), పెనాుర్‌ (సోమశిల) – కావేరీ (గ్రాండ్‌ ఆనకట్‌) లింకుప్రాజెక్టుల డిపిఆర్‌లను ఎన్‌డబ్ల్యుడిఎ సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 4, 000 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని బదిలీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు.

ఇరిగేషన్‌కు 2,537, తాగునీటి అవసరాలకు 616, పరిశ్రమలకు 855 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని తెలంగాణ, ఎపి, పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎపి, తెలంగాణలకు ట్రిబ్యునల్‌ కేటాయించిన నికర జలాలకు ఎటువంటి నష్టమూ జరగదని, మిగిలిన జలాలనే లింకు ప్రాజెక్టులకు తరలిస్తామని స్పష్టం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ ఆమోదం తీసుకున్న తర్వాతే అనుసంధానంపై ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు నికర జలాలకు నష్టం జరగకుండా ఉంటే నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదని, పూర్తి సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇఎన్‌సి నారాయణరెడ్డి తెలిపారు. లింకు ప్రాజెక్టుల్లో పోలవరం కాలువను వినియోగించుకోవాలని కోరారు.

 అయితే, గోదావరిలో కేటాయింపులకు లోబడి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్‌లను కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టిందని, ముందుగా వాటిని తేల్చాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఇఎన్‌సిలు మురళీధర్‌, హరిరామ్‌ స్పష్టం చేశారు. నదుల అనుసంధానానికి కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు.