మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా బీజేపీ ‘నిరసన దీక్ష’

తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం ‘‘నిరసన దీక్ష’’ చేపట్టారు. ప్రీతి కేసులో కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసును పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు.
 
ప్రీతి ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది? అనే విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని పేర్కొంటూ ఎందుకు నిజాన్ని దాచి పెడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కండువాను మెడలో వేసుకని, ఎన్ని అరాచకాలు అయినా చేయొచ్చని.. ఎన్ని అఘాయిత్యాలు అయినా చేయొచ్చని, అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయని సంజయ్ విమర్శించారు.
 
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి తదితరులు ఈ దీక్షకు హాజరై ప్రసంగించారు.
 
కేసీఆర్ పాలనలో మహిళలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైనయని, శాంతి భద్రతలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
 
జూబ్లిహిల్స్, నిర్మల్, మంథని సహా రాష్రంలో మహిళలు, విద్యార్థినులపై వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, పూటకో అత్యాచారం…రోజుకో హత్య జరుగుతున్నా నోరు విప్పడని ధ్వజమెత్తారు. శవాలను ఎత్తుకెళ్లి రాజకీయం చేసే దుర్మార్గమైన.. నీచమైన స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు
 
రాష్ట్రంలో ఆడబిడ్డలు చనిపోతుంటే కనీసం పరామర్శించడం లేదని, ప్రగతి భవన్ నుంచి బయటకు రావటం లేదంటూ కేసీఆర్ తీరును సంజయ్ ఎండగట్టాడు. రాష్ట్రంలో క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని, నేరాలు – ఘోరాలు జరుగుతుంటే కనీసం రివ్యూ చేసే టైం కూడా కేసీఆర్ కు లేకపోవటం దౌర్భాగ్యం అన్నారు.
 
యూపీలో మహిళలపై కన్నెత్తి చూస్తే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తారు.. తెలంగాణలోనూ అదే పని చేస్తాం.. యూపీ తరహా పాలన తీసుకొస్తాం… మహిళల జోలికి వస్తే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.