నాగాలాండ్‌, మేఘాలయాలలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వాలు

ఎన్‌డిపిపికి చెందిన నెయిఫియు రియో, ఎన్‌పిపికి చెందిన కొన్రాడ్‌ సంగ్మాలు నాగాలాండ్‌, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం  ప్రమాణ స్వీకారం చేశారు. బిజేపియికి చెందిన మాణిక్‌ షా హోలీ మరుసటి రోజు గురువారం త్రిపుర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నైఫియు రియో ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం నైఫియుకు ప్రధాని వేదికపైనే అభినందనలు తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎంతో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
 
వీరిలో జి కైటో అయే, జాకబ్ జిమోమి, కేజీ కెనీ, టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్, సాల్హటునో క్రూజ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. సాల్హటునో క్రూజ్‌ నాగాలాండ్‌ తొలి మంత్రిగా రికార్డు సృష్టించారు. ఇటీవల ముగిసిన నాగాలాండ్ ఎన్నికల్లో 60 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 37స్థానాలను కైవసం చేసుకున్నది. ఎన్‌డీపీపీ, బీజేపీ రెండు రియోను ముఖ్యమంత్రిగా ప్రకటించాయి.
 

కాగా, అంతకు ముందు మేఘాలయ రాష్ట్రంలో ఎండిఎ  (మేఘాలయ డెమొక్రటిక్‌ అలయన్స్‌) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్ పిపి) చీఫ్‌ కాన్రాడ్‌ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మేఘాలయ సీఎంగా ప్రమాణం చేయడం ఇది వరుసగా రెండోసారి. మేఘాలయ గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.

సంగ్మాతోపాటుగా ప్రిస్టోన్‌ టైన్సాంగ్‌, స్నియావ్‌భలాంగ్‌ ధార్‌ మేఘాలయ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎమ్మెల్యేలు అబు తాహెర్‌ మోండల్‌, కైర్‌మెన్‌ షిల్లా, మార్కుయిస్‌ ఎన్‌ మరాక్‌, రక్కమ్‌ ఎ సంగ్మా, అలెగ్జాండర్‌ లలూ హెక్‌, అంపరీన్‌ లింగ్డో, పాల్‌ లింగ్డో, కొమింగోన్‌ యంబాన్‌, షక్లియర్‌ వార్జ్రీల చేత గవర్నర్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు.

మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్ పిపి 26 స్థానాల్లో విజయం సాధించి సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. ఆ తర్వాత 11 స్థానాలతో యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్) రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సంగ్మా యూడీఎఫ్, హెచ్ఎస్పిడిపి, బీజేపీ, ఇండిపెండెంట్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు.