ఫోటోగ్రఫీ సార్వత్రిక దృశ్య భాష

ఫోటోగ్రఫీని  సార్వత్రిక దృశ్య భాషగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్  అభివర్ణించారు. ఫోటోగ్రఫీ సమయం, స్థలాన్ని అధిగమించి వర్తమాన కాలం, గతాన్ని చూసేందుకు సహకరిస్తుందని మంత్రి చెప్పారు. ‘ఫోటోగ్రాఫ్‌లు అబద్ధం చెప్పవు.  ప్రతి చర్య, భావోద్వేగం  సత్యాన్ని ఎల్లప్పుడూ మాట్లాడతాయి’ అని పేర్కొన్నారు.
 
8 వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులను ఢిల్లీలో ప్రధానం చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమం, స్వాతంత్ర సమరయోధులు   చిరస్థాయిగా నిలిచేలా  ఛాయాచిత్రాలు చేశాయని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో అలనాటి సంఘటనలు, చరిత్రను ఛాయాచిత్రాలు  గుర్తు చేస్తున్నాయని ఆయన చెప్పారు.
 
వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే ఫోటోగ్రాఫర్లు చిత్రాల ద్వారా కథలు చెప్పాలని తపన పడుతుంటారని డాక్టర్ మురుగన్ తెలిపారు. వాస్తవాలు, గణాంకాలు వెలికి తీసే   ఫోటోగ్రాఫర్‌లు అబద్ధాలు, నకిలీల ముసుగులను తొలగించగల సామర్థ్యం కలిగి ఉంటారని కొనియాడారు.  దేశ  అద్భుతమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వంపై  అవగాహన పెంపొందించడంతో పాటు  సాంస్కృతిక విలువలను  ప్రపంచానికి పరిచయం చేయడంలో  ఫోటోగ్రాఫర్‌లు కీలక పాత్ర పోషిస్తారని ఆయన చెప్పారు.
 
ఒక  జీవన  సాఫల్య అవార్డుతో సహా మొత్తం 13 అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. జీవన  సాఫల్య అవార్డుగా రూ. 3 లక్షలు,  ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా రూ. 1 లక్ష,  అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ తరగతిలో రూ. 75,000 నగదు బహుమతి,  5 ప్రత్యేక ప్రస్తావన అవార్డులు ప్రొఫెషనల్,  అమెచ్యూర్ కేటగిరీలలో వరుసగా రూ.50,000, రూ.30,000 నగదు బహుమతులు అందించారు.
 
జీవన సాఫల్య  అవార్డును  సిప్రా దాస్ స్వీకరించారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును శశి కుమార్ రామచంద్రన్‌ అందుకున్నారు.  అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును   అరుణ్ సాహా గెలుచుకున్నారు. ప్రొఫెషనల్ తరగతిలో  “లైఫ్ అండ్ వాటర్” ఇతివృత్తంతో తీసిన ఫోటోలకు, అమెచ్యూర్ విభాగంలో  “కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా” ఇతివృత్తంతో తీసిన ఫోటోలను అవార్డులకు ఎంపిక చేశారు.