యువతలో దాగి ఉన్న శక్తి, సామర్థ్యాన్ని వెలికి తీయాలి

యువతలో దాగి ఉన్న శక్తి, సామర్థ్యాన్ని వెలికి తీయాలి

ప్రపంచంలోనే అతిపెద్ద యువ-శక్తి భారతదేశంలో ఉందని పేర్కొంటూ యువతలో దాగి ఉన్న శక్తి, సామర్థ్యాన్ని వెలికి తీయాలని  కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపిచ్చారు. విద్యార్థులు తమ హృదయానికి దగ్గరగా ఉండే ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

యువ ఉత్సవ్- ఇండియా @ 2047 జాతీయ యువజన ఉత్సవాలను పంజాబ్ లోని రోపర్ ఐఐటీ నుంచి ప్రారంభించిన ఠాకూర్ యువ ఉత్సవ్ డాష్ బోర్డు కూడా ప్రారంభిస్తూ  “యువత రేపటి దేశ నిర్మాతలు” అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశానికి సేవ చేసి యువత స్వాతంత్ర్య సమరయోధులు గర్వించేలా చేయాలని కోరారు.

చిరుధాన్యాల ప్రాముఖ్యత, ప్రాధాన్యతను ఠాకూర్ వివరిస్తూ చిరుధాన్యాల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని, నీటి వినియోగం తగ్గుతుందని,  భూసారాన్ని రక్షించడానికి వీలవుతుందని వివరించారు.  “నేడు పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు (స్టార్టప్) కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. దేశంలో 107 యునికార్న్స్ పనిచేస్తున్నాయి. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు ఏర్పాటు అవుతున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది” అని కేంద్రమంత్రి తెలిపారు.

ఒక్కప్పుడు బలహీన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి, అమలు చేసిన కార్యక్రమాల వల్ల ఇదంతా సాధ్యమైందని ఠాకూర్ స్పష్టం చేశారు.

యువ ఉత్సవ్ ఏకకాలంలో ప్రతాప్‌గఢ్ (యు.పి.), హరిద్వార్ (ఉత్తరాఖండ్), ధార్ , హోసంగాబాద్ (ఎం.పి.), హనుమాన్‌గఢ్ (రాజస్థాన్), సరైకేలా (జార్ఖండ్), కపుర్తలా (పంజాబ్), జల్గావ్ (మహారాష్ట్ర), విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్). కరీంనగర్ (తెలంగాణ), పాలఖడ్ (కేరళ), కడలూరు (తమిళనాడు)లో ప్రారంభమైంది. మొదటి దశలో 31 మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో యువశక్తిని పురస్కరించుకుని యువ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

కార్యక్రమంలో పాల్గొనే వారు 5 లక్ష్యాలను అమృత కాలంలో సాధించడానికి అనుసరించాల్సిన ప్రణాళికపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఇండియా @ 2047 సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో యువతను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా యువ ఉత్సవ్ కార్యక్రమాలు జరగనున్నాయి.