పాక్ లో హతమైన ఉగ్రవాది ఆస్తుల జప్తు

 
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాకు చెందిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది బషీర్‌ అహ్మద్‌ పీర్‌ రెండు వారాల క్రితం పాకిస్థాన్‌లో హతమయ్యాడు. దీంతో కుప్వారాలోని అతని ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ జప్తు చేసింది.  భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉన్న టెర్రరిస్టు బషీర్‌ అలియాస్‌ ఇంతియాజ్‌ ఆలమ్‌ను పాకిస్థాన్‌లోని రావల్పిండిలో గుర్తుతెలియని వ్యక్తి గత నెల 20న కాల్చి చంపాడు.
ఈ నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం ఉపా కింద అతడి ఆస్తులను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నది. జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల తరలింపు, చొరబాటుకు సహకారం అందించడంలో కీలక పాత్ర పోషించిన పీర్‌ను గతేడాది అక్టోబరులో ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. పాకిస్థాన్‌లోని హిజ్బుల్ ముజాయిద్దీన్ ‌చీఫ్‌గా పీర్ వ్యవహరిస్తున్నాడు.
 
కశ్మీర్‌ లోయలో రిక్రూట్‌మెంట్లు, ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధాలు, పేలుడు పదార్థాల చేరవేతలో కీలకంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో బషీర్‌కు సంబంధించిన ఆస్తులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి రెండు రోజుల ముందు 1999 కాందహార్ హైజాక్ సమయంలో విడుదలైన ఉగ్రవాది ముస్తాఖ్ అహ్మద్ జర్గార్‌ అలియాస్ లాత్రమ్ ఆస్తులను జప్తు చేసింది.