సిసోడియాకు కోర్టులో చుక్కెదురు .. రిమాండ్ పొడిగింపు 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను శనివారం మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ అభ్యర్థన మేరకు, సిసోడియా రిమాండ్ ను మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.  అలాగే, మనీశ్ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది.
 
మార్చి 10వ తేదీన మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను విచారిస్తామని కోర్టు వెల్లడించింది. మనీశ్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఆదేశిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మనీశ్ సిసోడియా రిమాండ్ ను పొడగించాలని కోర్టును అభ్యర్థిస్తూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
ఎక్సైజ్ పాలసీ కేసు విచారణలో మనీశ్ సిసోడియా ఏ మాత్రం సహకరించడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో ఇద్దరు నిందితుల ఎదురుగా మనీశ్ సిసోడియాను ప్రశ్నించాల్సి ఉందని, అందువల్ల తమకు మరో రెండు రోజుల కస్టడీ అవసరమని కోర్టుకు విన్నవించారు.

మనీశ్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయాన్ కృష్ణన్, మోహిత్ మాథుర్ హాజరయ్యారు. రిమాండ్ ను పొడగించడం వల్ల ఉపయోగం లేదని, ఇప్పటికే తన క్లయింట్ సిసోడియా ఇల్లు, ఆఫీస్ లలో తనిఖీలు చేశారని, కానీ ఎలాంటి సాక్ష్యాధారాలను సాధించలేకపోయారని దయాన్ కృష్ణన్ వాదించారు.

ఇప్పుడు కస్టడీని పొడగించడం వల్ల ఏ డాక్యుమెంట్లను వారు సాధించగలరని ప్రశ్నించారు. సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రిమాండ్ పొడగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని మోహిత్ మాథుర్ కోర్టును కోరారు.

కాగా, సీబీఐ అధికారులు తనతో మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని, ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లేదని సిసోడియా కోర్టుకు తెలిపారు. అయితే, తనను 9 నుంచి 10 గంటల పాటు విచారణ గదిలో కూర్చోబెడుతున్నారని, అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. అలా పదేపదే ఒకే ప్రశ్నను అడగడం మానసికంగా వేధించడమేనని పేర్కొన్నారు. దానితో ఒకే ప్రశ్నను పలుమార్లు అడగవద్దని కోర్టు సీబీఐకి సూచించింది.