విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించి తన ఆస్తులను జప్తు చేసుకోవడానికి ముంబై కోర్టులో జరుగుతున్న ప్రక్రియను సవాలు చేస్తూ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

ప్రభుత్వం, ఆర్థిక సంస్థలను చర్యలను సమర్థించింది కోర్టు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా విదేశాలకు వెళ్లటాన్ని ఏమంటారంటూ మాల్యా తరపు న్యాయవాదులను ప్రశ్నించింది కోర్టు. తన క్లయింట్స్ తో సన్నిహితంగా లేకపోవడం, వారి నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు స్వీకరించక పోవడం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారని విజయ్ మాల్యా తరపు న్యాయవాది చెప్పారు. 

చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తామని, ఆస్తుల వేలం నిలిపివేయాలని కోర్టును కోరారు. అయితే కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు అభిప్రాయంతో ఏకీభిస్తూ.. విజయ్ మాల్యా పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.

2016, మార్చిలో ఇంగ్లాండ్ పారిపోయిన మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కింద అనేక బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. వాటిని చెల్లించటంలో విఫలం అయ్యారు. బ్యాంకుల నుంచి ఒత్తిడి రావటం, అరెస్ట్ అవుతారనే వార్తల క్రమంలోనే ఆయన రాత్రికి రాత్రి భారత్ నుంచి ఇంగ్లాండ్ పారిపోయారు.

అప్పటి నుంచి భారత్ కు తిరిగి రాలేదు. బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పు కూడా కట్టలేదు. ఈ క్రమంలోనే  పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా గుర్తించింది ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూనే మాల్యా పిటీషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు కొట్టివేసింది.  మాల్యాను భారత్  తీసుకురావటానికి దౌత్యపరమైన చర్చలు కూడా జరుపుతుంది ప్రభుత్వం. లండన్ లోని కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం అందులోని లొసుగుల ఆధారంగా మాల్యా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉన్నాడు.