జాతీయ రహదారుల విస్తరణ పనులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఎల్కతుర్తి- సిద్దిపేట (ఎన్ హెచ్-765డిజి) జాతీయ రహదారి విస్తరణ పనులుసహా ఇతర రహదారుల పనుల పురోగతిపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశమై సమీక్షించారు.
ప్రధానమంత్రి నరంద్రమోదీ చేతుల మీదుగా గత నవంబర్ 12న సిద్దిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరిగాయి. మొత్తం రూ. 578.85 కోట్ల చేపట్టిన 63.641 కి.మీల మేర పనులు కొనసాగుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సంజయ్ కు వివరించారు.
అందులో భాగంగా సిద్దిపేట జిల్లా రంగధామంపల్లి బ్రిడ్జి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు మిట్టపల్లి, ముండ్రాయి, పల్మాకుల, బద్దిపడగ, బస్వాపురం, సముద్రాల, పందిళ్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్), జిల్లెలగడ్డ, ముల్కనూర్, కొత్తపల్లి, ఇందిరానగర్, ఎల్కతుర్తి గ్రామాల మీదుగా రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.
ఈ పనుల్లో భాగంగా బస్వాపూర్, పందిళ్ల వద్ద నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 26 మైనర్ బ్రిడ్జీల పునర్నిర్మాణం వివరాలను ఈ సందర్భంగా బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ రహదారి విస్తరణ పనుల్లో బాగంగా కల్వర్టు నిర్మాణం, జంక్షన్ ఇంప్రూవ్ మెంట్, రీ అలైన్ మెంట్లు, స్ట్రక్చర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఇబ్బంది కాకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంజయ్ అధికారులకు సూచించారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గ్రుహాలు, మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ముల్కనూరు డెయిరీ సంస్థకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని,రహదా రి భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టాలని కోరారు. రహదారి విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు.

More Stories
సర్దార్ పటేల్ దూరదృష్టి వల్లే నేటి అఖండ భారతం
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..14 రోజుల రిమాండ్
ధాన్యాన్ని బలవంతంగా రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారు