దళితులు, ఓబీసీలు, విద్యార్థినులంటే కేసీఆర్ కు ద్వేషం

సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీరు తెలంగాణలో విద్యార్థులకు, మహిళలకు భద్రత లేదన్న విషయం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.
 
 ఇలాంటి ఘటనలు తెలంగాణ సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని చెబుతూ  కేసీఆర్ పాలన పట్ల నేడు తెలంగాణలో ప్రతి వర్గం విసిగిపోయిందని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల పంపిణీ మరిచిపోయిందని విమర్శించారు.
దీంతో 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడిందని చెప్పారు.
ఎస్సీ విద్యార్థుల కోసం కేటాయించిన నిధుల్లో 50 శాతం లోపే ఖర్చు చేశారని గుర్తు చేశారు. కళాశాలలో ర్యాగింగ్‌పై సీనియర్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలు, రైతులు, విద్యార్థులపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని తరుణ్ ఛుగ్ విమర్శించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కేసీఆర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు.
 
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ టూరిజంలో బిజీబిజీగా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి పాలనతో సామాన్య ప్రజానీకం విసిగిపోయింది. బంగారు తెలంగాణ హామీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
 
ప్రీతి మృతి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.