అగ్నిపథ్ పథకాన్ని ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవు

సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో రిలీజైన రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌లను కొట్టివేసింది.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, సాయుధ బలగాలను బలోపేతం చేసేందుకే ఈ పథకాన్ని రూపొందించినట్టు స్పష్టం చేసింది. అగ్నిపథ్ స్కీం ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవన్న కోర్టు ఈ పథకంపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

రక్షణ దళాల్లో నియామకాలకు పాత విధానాన్ని మాత్రమే కొనసాగించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇలా అడిగే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అగ్నిపథ్ పథకం కొనసాగుతుందని న్యాయస్థానం వెల్లడించింది.

కాగా, జూన్‌ 14, 2022న భారత ప్రభుత్వం ఆమోదించిన అగ్నిపథ్ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అగ్నిపథ్ స్కీంకు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ విధానం ద్వారా నియమితులైన వారిని అగ్ని వీర్ లు అంటారు.

సాయుధ దళాల్లో నాలుగు సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించేందుకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులో పోస్టింగ్ పొందవచ్చు. నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత 25 శాతం మంది పర్మినెంట్ అవుతారు.  మిగిలిన 75 శాతం తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది. వారికి వివిధ నియామకాల్లో ప్రత్యేక కోటా ఉంటుంది. ఈ పథకం ప్రకారం గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుండి విరమించాక పింఛను కూడా రాదు.

దీంతో అప్పట్లో ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. ఈ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అభ్యర్థులు 12 రైళ్ళను కూడా తగలబెట్టారు. అనేక రైళ్ళను మధ్య లోనే నిలిపివేయడం, రద్దు చెయ్యడం జరిగింది.

2022వ సంవత్సరం జులై నెలలో ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని లేదా పిటిషనర్లు తమ ముందు ఉంటే నిర్ణయం వెలువడే వరకు పెండింగ్‌లో ఉంచాలని సుప్రీం కోర్టు కోరింది.

అగ్నిపథ్‍ను నిలుపదల చేసేందుకు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ల విచారణను గతేడాది ఆగస్టులో ప్రారంభించింది. ఆర్మీలో యువత శాతాన్ని పెంచేందుకు, దేశ సాయుద దళాల బలోపేతానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కోర్టులో వాదనలు వినిపించింది కేంద్ర ప్రభుత్వం. విచారణను పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 15న తీర్పు ప్రకటనను వాయిదా వేసింది. ఇప్పుడు తుది తీర్పు వెలువరించింది.