త్రిపురలో అతిపెద్ద పార్టీగా బీజేపీ!

* పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

 
ఈశాన్య ప్రాంతంలో సోమవారం పోలింగ్ జరిగిన త్రిపురలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి అతిపెద్ద పార్టీగా వస్తుందని ఎగ్జిట్ పోల్ జరిపిన హైదరాబాద్ కు చెందిన ఎన్నికల పరిశోధన సంస్థ పీపుల్స్ పల్స్ వెల్లడించింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం త్రిపురలో అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు, సీపీఎం, ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 సీట్లు, ఐపీఎఫ్టీ పార్టీకి ఒక సీటు ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
త్రిపురలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు కనపడటం లేదు.  అదే జరిగితే  త్రిపురలో ఈ సారి ప్రభుత్వ ఏర్పాటులో నూతనంగా ఏర్పడిన తిప్రా మోతా పార్టీ ‘కింగ్ మేకర్ ’ రోల్  పాత్ర వహించే అవకాశం ఉంది.
 
 గతంలో 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సీపీఎం ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్నా అనుకున్న ఫలితాలు సాధించడం లేదు.

 త్రిపురలో గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న బీజేపీకి శాంతి భద్రతల్ని చక్కబెట్టడం కలిసొచ్చినా ప్రాంతీయ పార్టీ తిప్రా మోతా ఈ సారి ఆదివాసీ ఓటర్లను గంపగుత్తగా తన వైపు తిప్పుకోవడంతో స్పష్టమైన మెజారిటీ పొందలేకపోవచ్చని పీపుల్స్ పల్స్భావిస్తున్నది.

మరోవంక, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మానిక్ సర్కార్ సహా మరికొంతమంది సీనియర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం సీపీఎంకి ప్రతికూలంగా మారిందని తెలిపింది.
 
నాగాలాండ్ లో తిరిగి బిజెపి కూటమి
 
పీపుల్స్ పల్స్  సర్వే ప్రకారం నాగలాండ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీపీపీ పార్టీకి 20 నుంచి 27, బీజేపీ కి 14 నుంచి 21, ఎల్ జెపీకి 5 నుంచి 10 సీట్లు, ఎన్పీఎఫ్ కి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వస్తాయని వెల్లడైంది. నాగాలాండ్ లో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉంది.
 
నాగాలాండ్ లో ఎన్డీపీపీ, బీజేపీ కలిసి వరసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నాగాలాండ్ లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎన్డీపీపీ, బీజేపీ కూటమికి కలిసి వచ్చిందని భావిస్తున్నారు.
 
మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఎన్పీపీ
 
మేఘాలయలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్పీపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది.
ఎన్పీపీ కి 17 నుంచి 26 సీట్లు, టీఎంసీకి 10 నుంచి 14, యూడీపీకి 8 నుంచి 12, బీజేపీకి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 3 నుంచి 5, ఇతరులు 4 నుంచి 9 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
 
మేఘాలయలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉంది. కానీ, అక్కడ ఏ పార్టీ సొంతంగా అధికారంలో వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరే పొత్తే మేఘాలయలో అధికార పక్షాన్ని నిర్ణయిస్తుంది.
 
మేఘాలయలో నిరుద్యోగం, అవినీతి, అక్రమ బొగ్గు గనుల తవ్వకాలు, మౌలిక సదుపాయాల లేమికి సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. పైగా,  గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి కోనరాడ్ సంగ్మా కుటుంబ పాలన అనే ట్యాగ్ మోస్తుండటం కూడా ఎన్పీపీకి ప్రతికూలంగా మారింది.
 
మేఘాలయలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్పీపీ పార్టీల కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకోగా, ఈ సారి ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి.  2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నా వారిలో అత్యధికులను మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తన వెంట టీఎంసీలోకి తీసుకెళ్లడంతో ఈ సారి టీఎంసీ బలం పెరిగింది.