వరంగల్‌ KMC: ప్రీతిపై వేధింపుల కేసులో తెరపైకి తెలంగాణ హోంమంత్రి పేరు! 

సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక మెడికో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో పలు కీలక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ కేసు విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థిని తండ్రి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ తెలంగాణ హోంమంత్రికి బంధువు అనే కారణంతో పోలీసులు విచారణను సరైన దిశలో చేయట్లేదంటూ విద్యార్థిని తండ్రి నాగేందర్, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి ఇటువంటి వివాదాలు ఇది మొదటిసారి కాదు. గతేడాది సంచలనం సృష్టించిన జూబ్లీహీల్స్ మైనర్ పై అత్యాచారం కేసులో హోం మంత్రి మనువడి పేరు వినిపించింది. తాజాగా ఇదే నెలలో అమాయక యువతులను పెళ్లిళ్లు చేసుకుని మోసగిస్తున్న నెల్లూరు దర్గా అధిపతి బాబా హఫీజ్ పాషా కేసులోనూ హోం మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. హోం మంత్రి పేరు వరుసగా వివాదాస్పదం అవుతుండటం ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది.

మరివైపు ప్రీతిపై వేధింపులకు సంబంధించి నిందితుడి సైఫ్ మొబైల్ నుండి పోలీసులు  కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ సెక్షన్ల క్రింద అరెస్ట్ చేసినట్టు వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ బోనాల కిషన్ తెలిపారు. బాధితురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని అన్నారు. సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని అందరూ సంయవనం పాటించాలని సూచించారు.