ఉక్రెయిన్ తీర్మానంపై ఐరాస ఓటింగ్‌కు భారత్ దూరం

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని విరమించి తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాకు పిలుపునిస్తూ ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్‌ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళిక ముసాయిదా తీర్మానం ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. యుఎన్‌ ఛార్టర్‌లోని సూత్రాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా తమ దేశంలో సమగ్ర, న్యాయమైన మరియు శాశ్వత శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్‌ ముసాయిదాలో ఉద్ఘాటించింది. 

చైనా, పాకిస్తాన్ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 41 దేశాలు ఓటు వేయగా రెండు రోజుల చర్చల అనంతరం తీర్మానం ఆమోదం పొందింది. ఏడు దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 32 సభ్య దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అయితే..భారత ఉపఖండంలోని చిన్న దేశాలైన నేపాల్, భూటాన్, మాల్దీవులు, అప్ఘానిస్తాన్ తీర్మానాన్ని బలపరుస్తూ ఓటింగ్ చేశాయి.

తాము ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉండవలసి వస్తోందో భారత్ వివరణ ఇస్తూ ఉక్రెయిన్, రష్యాలను కలపకుండా యుద్ధం ఎలా ముగుస్తుందో తెలియడం లేదని పేర్కొంది. రెండు పక్షాల ప్రమేయం లేకుండా అర్థవంతమైన, విశ్వసనీయమైన ఫలితాన్ని ఇవ్వలేవని ఐరాసలో భారత తరఫున శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ వ్యాఖ్యానించారు.

కాగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడంలో, శాంతి నెలకొల్పడంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని గతంలో ఫ్రాన్స్‌ కోరింది. అంతర్జాతీయంగా గుర్తిచబడిన సరిహద్దులను అనుసరించి ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత నిబద్ధతను పాటించాలని ఉక్రెయిన్‌ పునరుద్ఘాటించింది. తమ దేశంలోని ప్రాదేశిక జలాల వరకు విస్తరించిన సైనిక దళాలను రష్యా వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొంది.

ఈ శాంతి ప్రణాళికను ప్రవేశపెట్టడానికి ముందు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు ఫోన్‌ వచ్చింది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయ అధిపతి యాండ్రీ యెర్మాక్‌ బుధవారం ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం కొనసాగుతున్న తీరును వివరించినట్లు సమాచారం.