రఫాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆపాలి .. ఐసిజె

రఫాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న నరహంతక దాడులకు తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశించింది. నగరంలో మానవతా పరిస్థితి మరింత దిగజారక ముందే దాడులను అరికట్టాలని కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. గాజాలో కాల్పుల విరమణ జరిగేలా చూడాలని కోరుతూ దక్షిణాఫ్రికా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
 
పౌర మరణాలను నివారించేందుకే ముందుగా ఖాళీచేయాలని ఆదేశించామని ఇజ్రాయిల్‌ మిలిటరీ చేసిన వాదన నమ్మశక్యంగా లేదని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాన్ని ఐసిజె చీఫ్‌ నవాఫ్‌ సలామ్‌ చదివి వినిపించారు. ఇజ్రాయిల్‌ తక్షణమే రఫాలో తన మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, ఇతరత్రా మార్గాల్లో దాడులు చేయరాదని కోర్టు ఆదేశించింది. 
 
ఇజ్రాయిల్‌ ఈ పని చేయకపోతే రఫాలో పౌర జీవనం మొత్తం నాశనమైపోతుందని హెచ్చరించింది. కోర్టు గత మార్చిలో జారీ చేసిన ఆదేశాన్ని ఇజ్రాయిల్‌ బేఖాతరు చేసింది. ఐసిజె రూలింగ్‌కు ఏ దేశమైనా చట్టపరంగా బద్ధురాలై ఉండాలి. అయితే, దీనిని అమలు చేసి తీరాల్సిందేనని కోర్టు బలవంతపెట్టలేదని ఇజ్రాయిల్‌ ప్రతినిధి అన్నారు. ఇజ్రాయిల్‌ తన పౌరులను కాపాడుకోకుం డా ఈ భూమండలం మీద ఏ శక్తి అడ్డుకోజాలదని స్పష్టం చేశారు.
 
మరోవంక, ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చేసిన సిఫార్సులు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయేల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, హమాస్‌ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ విజ్ఞప్తి చేశారు. దీనిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తప్పుబట్టారు. 
 
దీంతో ఇజ్రాయేల్ ప్రధాని అరెస్ట్‌కు ఐసీసీ వారెంటు జారీ చేస్తుందా? ఆయనను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. తీవ్రమైన యుద్ధ నేరాలు, మారణహోమం, దురాక్రమణ వంటి నేరాలపై మాత్రమే ఐసీసీ విచారణ చేపడుతుంది. ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ ప్రాథమికంగా విచారించి… సాక్ష్యాలు ఉన్నాయని నిర్దారణకు వస్తే అరెస్టు వారెంటు జారీ చేయాలని సిఫార్సు చేస్తుంది. 
 
అనంతరం ముగ్గురు న్యాయమూర్తుల ప్రాథమిక ధర్మాసనం పరిశీలించిన విచారణార్హత, వారెంట్‌పై నిర్ణయిస్తుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెల్లడిస్తారు. దీనిపై నిందితులు సంతృప్తి చెందకపోతే… ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ ధర్మాసనం ఇచ్చే తీర్పు అంతిమం. అయితే, నిందితుల అరెస్టు, ఆస్తుల జప్తుతో పాటు తీర్పును అమలు చేయాలన్నా సభ్యదేశాలపై ఆధారపడటం తప్పించి ఐసీసీకి స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాధికారం లేదు.