బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.  ఆపరేషన్ గోల్డెన్ డాన్‌  పేరుతో ఇండో-నేపాల్‌ సరిహద్దు  సహాదేశంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం రూ.51 కోట్ల విలువైన 101.7 కిలోల బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నారు.
 
స్మగ్లింగ్ ముఠాకు చెందిన పది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఏడుగురు సుడాన్‌ దేశస్థులు ఉన్నారని మహారాష్ట్ర డీఆర్ఐ అధికారులు తెలిపారు. వీరిలో సైఫ్ సయ్యద్ ఖాన్, షంషేర్ ఖాన్, మనీశ్ ప్రకాశ్ జైన్ భారతీయులని చెప్పారు. ముసాబ్ మొహమ్మద్ నోరే, ముసాబ్ హసన్ ఎల్‌హసన్‌లను సుడాన్‌లు చెందినవారని అన్నారు
 
పట్నా, పుణె, ముంబయిలతో పాటు భారత్-నేపాల్‌ సరిహద్దులో సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.35 కోట్లు విలువైన దేశ, విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అక్రమం బంగారాన్ని ఎక్కువ మొత్తం పేస్ట్‌ రూపంలో భారత్-నేపాల్‌ సరిహద్దు గుండా పట్నాకు తీసుకొచ్చి, అక్కడ నుంచి రైళ్లు, విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
ఇందులో సింహభాగం ముంబయికి రవాణా చేస్తున్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు.  ఆదివారం అర్ధరాత్రి పట్నా రైల్వే స్టేషన్‌లో ముంబయి రైలు ఎక్కుతున్న ముగ్గురు సుడాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నామని, వీరి వద్ద 37.13 కిలోల బంగారం పేస్ట్‌ లభ్యమైందని పేర్కొన్నారు. అలాగే, ప్రత్యేకంగా తయారుచేసిన స్లీవ్‌లెస్‌ జాకెట్‌లలో 40 ప్యాకెట్లలో రహస్యంగా దాచిన 38.76 కిలోల బంగారాన్ని మరో ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
 
మూడో వ్యక్తి సరిహద్దుల్లో అక్రమ రవాణా కార్యకలాపాలకు ఏర్పాట్లు చేస్తున్నాడని తేలింది. వీరితో పాటు బస్సులో హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న ఇద్దరు సుడాన్ మహిళలను సోమవారం పుణెలో అరెస్ట్‌ చేశారు. వారి వద్ద 5.615 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 18న చేపట్టిన ఈ ఆపరేషన్ మూడు రోజుల పాటు నిర్వహించినట్టు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.
 
అలాగే, ముంబయిలోని కోల్బాకు చెందిన సైఫ్, షంషేర్‌ ఇద్దరూ సోదరులని, ఈ ఇద్దరూ విదేశీయుల నుంచి బంగారం కొనుగోలు చేసి.. జవేరీ బజారులోని బంగారు నగల వ్యాపారి మనీష్‌కు అమ్ముతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ముంబయికి చెందిన మరో ముగ్గురు నిందితులు గతంలో అక్రమ బంగారాన్ని భారీ మొత్తంలో అందుకున్నట్టు డీఆర్ఐ భావిస్తోంది.