ఢిల్లీ మేయ‌ర్‌గా ఆప్ అభ్య‌ర్ధి షెల్లీ ఒబెరాయ్‌

ఢిల్లీ మేయ‌ర్‌గా ఆప్ అభ్య‌ర్ధి డా. షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ, లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగబద్దంగా పాలన కొనసాగిస్తానని హామీ ఇస్తూ, ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. దాదాపు రెండు గంటల సేపు ప్రశాంతంగా కొనసాగిన ఓటింగ్ లో బీజేపీ అభ్యర్థి రేఖ గుప్తాను షెల్లీ ఒబెరాయ్ ఓడించారు. షెల్లీ 150 ఓట్లను సాధించగా రేఖకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, షెల్లీ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు.

మేయ‌ర్ ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే మూడుసార్లు మున్సిప‌ల్ స‌మావేశం వాయిదా పడింది. ఆప్‌, బీజేపీ మ‌ధ్య వాగ్వాదం వ‌ల్ల మేయ‌ర్ ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయితే ఇవాళ నాలుగోసారి స‌మావేశ‌మైన ఎంసీడీ చివ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించింది.  బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి, హ‌న్స‌రాజ్‌లు తొలుత ఓటేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు మేయ‌ర్ ఎన్నిక‌ను నిర్వ‌హించారు. నామినేటెడ్ స‌భ్యులకు ఓటు హక్కు కల్పించడాన్ని షెల్లీ ఒబ్రాయ్ సుప్రీంలో సవాలు చేశారు. నామినేటెడ్ స‌భ్యులకు ఓటు హ‌క్కు లేద‌ని సీజేఐ డీవై చంద్ర‌చూడ్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసిన అనంతరం ఎన్నిక జరిగింది. 

కాగా, షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్ జీవితకాల సభ్యురాలు కూడా. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి ఒబెరాయ్ పీహెచ్‌డీ చేశారు.

ఢిల్లీ మేయ‌ర్‌గా ఆప్ అభ్య‌ర్ధి డా. షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ, లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగబద్దంగా పాలన కొనసాగిస్తానని హామీ ఇస్తూ, ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు.

 250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకుని, మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ ప‌ట్టుకోల్పోయింది.