నీతిఆయోగ్‌ సీఈవోగా సుబ్రమణ్యం

ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్‌ కొత్త సీఈవోగా మాజీ ఐఏఎస్‌ అధికారి, తెలుగు వ్యక్తి బీవీఆర్‌ సుబ్రమణ్యం సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న పరమేశ్వరన్‌ అయ్యర్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పరమేశ్వరన్‌ ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు.
 
బాధ్యతల స్వీకరణ అనంతరం నీతిఆయోగ్‌ సీఈవోగా బీవీఆర్‌ సుబ్రమణ్యం రెండేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి కేంద్ర క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీవీఆర్‌ సుబ్రమణ్యం ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.
 
ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఆయన లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ డిగ్రీ చేశారు. 2004-08, 2012-2015 మధ్య ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.
 
 2015లో ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయిన సుబ్రమణ్యం.. అక్కడ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, అదనపు ప్రధాన కార్యదర్శి(హోం)గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆయన్ను జమ్ముకశ్మీర్‌ ప్రధాన కార్యదర్శిగా బీబీ వ్యాస్‌ స్థానంలో 2018, జూన్‌ 20న నియమించింది.  జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఈ నియామకం చోటుచేసుకొన్నది. ఈయన సీఎస్‌గా ఉన్నప్పుడే ఆర్టికల్‌ 370 రద్దు జరిగింది.