పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ కేంద్రం పరిధిలో లేదు

పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశం కేంద్రం నిర్ణయంపై ఆధారపడి లేదని, ఆ నిర్ణయంలో రాష్ట్రాలదే కీలకపాత్ర అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  స్పష్టం చేశారు.  జైపూర్ లో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న పక్షంలో పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాగలమనిఆమె తెలిపారు.

జిఎస్‌టి కౌన్సిల్ ప్రభుత్వ పరిధిలోనిది కాదని, దాని నిర్వహణ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులదని ఆమె వివరించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ను ఒక చర్చనీయాంశంగా జిఎస్‌టిలో చేర్చడానికి సిద్ధమేనని, అయితే దీనిపై నిర్ణయం తీసుకోవలసింది జిఎస్‌టి కౌన్సిల్ మాత్రమేనని నిర్మలా సీతారామన్ సూచనప్రాయంగా వెల్లడించినట్లియింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా జీఎస్టీ మండలి సమావేశంలో ఈ విషయమై తమ నిర్ణయాన్ని వెల్లడించాలని ఆమె సూచించారు.

ఇక, కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై జవాబిస్తూ ఈడీ, సిబిఐ, తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు రాత్రికి రాత్రే దాడులు జరపవని ఆమె స్పష్టం చేశారు. క్షుణ్ణంగా వివరాలు సేకరించి ప్రాథమిక ఆధారాలు లబించాక తమకు అవతలి పక్షం నుంచి సరైన సమాధానాలు రానిపక్షంలోనే దాడులు జరుపతాయని మంత్రి వివరించారు.

ప్రతీకార ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఆమె ఖండించారు. వాస్తవాలు తెలియకుండా కాంగ్రెస్ ఈ అంశాలపై రాద్ధాంతం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు.  పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఒక పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు ఆర్థిక వ్యవహారాలు లేదా అవినీతికి సంబంధించిన కేసుల్లో బెయిల్ మీద తిరుగుతూ కక్షసాధింపు రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.

అవినీతి గురించి కాంగ్రెస్ అస్సలు మాట్లాడకూడదని, పైగా కక్షసాధింపు చర్యలంటూ నిందించడం సిగ్గుచేటని ఆమె చెప్పారు. వరుసగా ఒక్కో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లోనే అధికారాన్ని కోల్పోయాయని ఆమె ఆరోపించారు.