వ్యాజ్యాల పరిష్కారానికి వ్యవస్థాగత మధ్యవర్తిత్వం

దేశంలో వ్యాజ్యాల పరిష్కారానికి వ్యవస్థాగత మధ్యవర్తిత్వం దోహదం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు. ఇప్పుడున్న ఇష్టానుసార, వ్యక్తిగత మధ్యవర్తిత్వ ప్రక్రియలో పలు లొసుగులు ఉన్నాయని చెప్పారు. ఎటువంటి మధ్యవర్తిత్వ పరిష్కారానికి అయినా ముందుకు దీనికి అధికారిక లేదా వ్యవస్థాగత ఆమోద ముద్ర అవసరం లేదా కనీసం వీటి దృష్టికి ఆయా మధ్యవర్తిత్వాలు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అడ్‌హాక్ మధ్యవర్తిత్వంతో తలెత్తే లోపాల నివారణకు ఆ తరువాత తిరిగి కోర్టులు జోక్యం చేసుకోవల్సి వస్తోందని, దీనితో ఏళ్ల తరబడి కేసులు నానుతూ పోతున్నాయని న్యాయశాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అర్బిట్రిషేయన్ వారాంతపు కార్యక్రమంలో ఆదివారం మంత్రి ప్రసంగించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో కృత్రిమ మేధ ఉపకరిస్తుందని, సంబంధిత పత్రాల తగు పరిశీలనకు, విశ్లేషణకు, న్యాయ అధ్యయనానికి , తీర్పుల జారీకి ఈ సాంకేతిక ప్రక్రియ దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.

న్యాయం చట్టానికి సంబంధించి నిర్ధేశిత నిబంధనలు ఉంటాయి. అయితే అడ్‌హాక్ ప్రక్రియలో జరిగే మధ్యవర్తిత్వ ప్రక్రియలో వీటిని పాటించడం లేదని, దీనితో ఇటువంటి పరిష్కారాలు చివరికి కోర్టుపరంగా చెల్లనేరకుండా పోతాయని ఆయన  వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని కోర్టుల పరిశీలన పరిధిలోకి తీసుకువచ్చి సాగించే ఎటువంటి మధ్యవర్తిత్వ ప్రక్రియ అయినా చట్టం న్యాయపరంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

 ఈ ఏడాది అంటే 2023లో మధ్యవర్తిత్వ పరిష్కారాల ప్రక్రియ మరింత బలోపేతం కావాలనేదే ప్రభుత్వ ఆలోచన అని కేంద్ర మంత్రి చెప్పారు.ఇప్పుడున్న అర్హమైన విధానాలకు తగు సవరణల ద్వారా సకాలంలోనే జాప్యం లేకుండా వ్యాజ్యాల పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రక్రియను సరళీకృతం చేసే పద్ధతికి (ఇఒడిబి) కట్టుబడి వ్యవహరిస్తామని వెల్లడించారు.

ప్రపంచబ్యాంక్ వెలువరించిన ఓ నివేదిక ప్రకారం చూస్తే భారత దేశంలో ఓ కేసు పరిష్కారానికి సగటున కనీసం 1445 రోజులు పడుతోంది. ఇందులో 31 శాతం వరకూ కేసు పరిష్కారం దిశలో కేవలం విచారణల ప్రక్రియకే సరిపోతుందని న్యాయమంత్రి తెలిపారు.