ఎమ్యెల్సీ ఎన్నికల ప్రచారంలో విసి పాల్గొనడంపై రగడ

ఆంధ‌్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో అధికార పార్టీ జరిపిన చర్చల్లో పాల్గొవడం వివాదాస్పదమైంది. ఏయూ వీసీ, మాజీ రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్ధికి మద్దతుగా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి13న జరుగనుంది. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పివిజిడి.ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌, ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు.

విశాఖలోని ఓ ప్రయివేటు హోటల్లో వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు అనుకూలంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలతో ఈ సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి సుమారు వంద కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బంది వచ్చారు. ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యం రాజు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కళాశాలల్లో చదువుతున్న పిజి విద్యార్థులతో పాటు, సిబ్బంది ఓట్లు సుధాకర్‌కు అనుకూలంగా వేసేలా చూడాలని ఈ సమావేశంలో కాలేజీ యాజమాన్యాలకు నిర్దేశించారు. కాలజీలతో సమావేశం విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు విశాఖ జిల్లా ఆర్‌డిఒ, డిఆర్‌ఒలకు సమాచారం అందించారు.  సమావేశం జరుగుతున్న హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విసి, రిజిస్ట్రార్‌ అక్కడి నుంచి జారుకున్నారు.

ఎన్నికల కోడ్‌ను ధిక్కరించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జునను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమావేశం జరుగుతున్న విషయాన్ని ఆర్‌డిఒ, డిఆర్‌ఒలకు తెలియజేసినా వారు స్పందించ లేదని నాయకులు ఆరోపించారు.

ఓటర్లను ప్రభావితం చేసేలా ఎయు విసి అధికార దుర్వినియోగం చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ తెలిపారు. విసి ప్రసాద్‌రెడ్డి గతంలోనూ పలు సందర్భాల్లో తన హోదాను మరిచి అధికార పార్టీ ఏజెంటుగా వ్యవహరించారని విమర్శించారు.