సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూశారు. సాయన్నకు నిన్న ఫిబ్రవరి 16న షుగర్ లెవల్స్ పడిపోవటంతోకుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావటంతో ఎమ్మెల్యే సాయన్న ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
 
సాయన్న రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే 2016లోనూ సాయన్నకు ఓసారి గుండెపోటు వచ్చింది. కాగా ఈసారి మరోసారి గుండెపోటు రావటంతో సాయన్న ఆఖరి శ్వాస విడిచారు.  సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు.
 
టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన సాయన్న 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. అనంతరం 2009లో అనూహ్యంగా ఓడిపోయారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫునన బరిలో దిగి మరోసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొద్దిరోజుల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరి.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు.
 
1951 మార్చి 5న హైదరాబాద్ చిక్కడపల్లిలో జన్మించిన సాయన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, న్యాయ విద్య పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 
ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న అరుదైన ఘనత సాధించారన్న సీఎం  వివిధ పదవుల ద్వారా ఆయన చేసిన ప్రజా సేవ చిరస్మరణీయమని పేర్కొన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  సాయన్న ఇక లేరన్న వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారని తెలిపారు. పలువురు మంత్రులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు సాయన్న కుటుంబానికి సానుభూతి తెలిపారు.