ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఈనెల 16 న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం ముగిసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ప్రచారం నెలరోజుల పాటు ఉధృతంగా సాగింది. మార్చి 3 న ఓట్లు లెక్కిస్తారు. రెండు దశాబ్దాల సిపిఎం పరిపాలనకు ఆశ్చర్యకరంగా ముగింపు పలికి ఐదేళ్లక్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి మరోసారి అధికారంలోకి రావడంకోసం విస్తృతంగా ప్రచారం చేసింది.

ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మరో 12 మంది కేంద్ర మంత్రులు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించారు.  ఓటర్లను ఆకట్టుకోడానికి విజయ్ సంకల్ప యాత్ర, ర్యాలీలు, రోడ్‌షోలను బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించింది.  సిపిఎం తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సీనియర్ నేతలు ప్రకాష్ కారత్, బృందాకారత్, మొహమ్మద్ సలీం, మాజీ సిఎం మానిక్ సర్కార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి ప్రచారం సాగించారు. తాము కోల్పోయిన పట్టును తిరిగి పొందాటంకోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున అధిర్ చౌదరి, దీపాదాస్ మున్షీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్, ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ ఈ ప్రచారంలో పాల్గొనలేదు. తిప్రమోత పార్టీ తరఫున మాజీ రాజకుటుంబ వారసులు ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దేవ్‌వర్మ ఒక్కరే ప్రచారం సాగించారు.

గత ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని బీజేపీ చాటుకోగా, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ బీజేపీ తప్పుడు పరిపాలన విధానాలను ప్రముఖంగాఎత్తి చూపారు. టిప్ర మోతా ప్రాంతీయ పార్టీ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేసింది. ఎన్నికల రేసులో మొత్తం 259 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 20 మంది మహిళలు.55 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా, దాని మిత్ర పక్షం ఐపిఎఫ్‌టి ఆరు నియోజక వర్గాల్లో పోటీ చేస్తోంది.ఒకస్థానంలో స్నేహపూర్వక పోటీ ఉంటుంది.

47 స్థానాల్లో సిపిఎం, 13 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, ఇండిపెండెంట్లుగా 58 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ అత్యధిక సంఖ్యలో 12 మంది మహిళలను పోటీలో ఉంచింది. దాదాపు 28.13 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు.

 పెద్దగా ఎలాంటి శాంతిభద్రతల సంఘటనలు లేకుండా ప్రచారం ప్రశాంతంగా మంగళవారం 4 గంటలకు ముగిసిందని, ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సిద్ధమయ్యారని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ (సిఇఒ) గిట్టే కిరణ్‌కుమార్ దినకర్‌రావు చెప్పారు. మొత్తం 3328 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. వీటిలో 1100 కేంద్రాలు ఉద్రిక్త ప్రాంతాల్లో ఉండగా, 28 కేటగిరి ప్రకారం క్లిష్టమైనవని తెలిపారు.

400 కంపెనీల కేంద్ర భద్రతా దళాలను ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు మోహరింపచేసిన్నట్లు రాష్ట్ర పోలీస్ నోడెల్ అధికారి జి ఎస్ రావు తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషనల వద్ద కేంద్ర సాయుధ దళాలను మోహరింపు చేయనున్నట్లు చెప్పారు.