మామిడిపల్లి, గోవింద్ పేట్ ఆర్వోబిని ప్రారంభించిన‌ ఎంపీ అరవింద్

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ స్కీం కింద తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో  అభివృద్ది చెందనున్నాయని, ఇందులో నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, గోవింద్పేట్ ఆర్వోబీని బుధవారం ప్రారంభిస్తూ కేంద్రం నిధులతో రాష్ట్రంలో2493 కిలోమీటర్ల పరిధిలో రూ.29,581కోట్ల రైల్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
 
2014 సంవత్సరం వరకు రైల్వే శాఖ ద్వారా రూ.886 కోట్ల పనులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు చేసిందని చెబుతూ 2023–2024 సంవత్సరంలో రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.4,418 కోట్లు రైల్వే పనుల కోసం తెలంగాణలో ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు.  ఈ రోజు వరకు 412 రైల్వే ఫై ఓవర్స్ ప్రారంభించుకున్నామని చెప్పారు.
 
 అడవి మామిడిపల్లి ఆర్వోబీ పనులు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండేళ్ళుగా ఆలస్యం అవుతున్నాయని, పనులు కావాలంటే నాయకుల ఒత్తిడి, నాయకుల అవినీతి ఉండకుండా కమీషన్ల కోసం ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాంట్రాక్టర్లకు దూరంగా ఉండాలని, పనులు చేయనివ్వాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉంటే అంత మంచిదని పేర్కొన్నారు.
 
ఊరు మామిడిపల్లి ఆర్వోబీ పనులు జూన్ లోగా ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అడవి మామిడిపల్లి ఆర్వోబీ పనుల్లో భాగంగా రైల్వే శాఖ చేయాల్సిన పనులు పూర్తయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో చేయాల్సిన అప్రోచ్ రోడ్డు చేయించే బాధ్యత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీసుకుని తన చిత్త శుద్ది నిరూపించుకోవాలని కోరారు.