సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు

సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా పదవి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్‌‌లతో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డీవీ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

దాంతో, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందకముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి రాకతో తొమ్మిది నెలల విరామం తర్వాత సుప్రీంకోర్టు పూర్తి స్థాయికి చేరుకుంది.

అంతకుముందు ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఈ ఐదుగురు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జస్టిస్‌లు పంకజ్ మిథాల్, సంజయ్ కరోల్, పీవీ సంజయ్ కుమార్, అహ్సానుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రాలతో ప్రమాణం చేయించారు. డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేశారు.

కాగా, 1961 ఏప్రిల్ 16న జన్మించిన జస్టిస్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 62వ ఏట పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించినందున మరో మూడేళ్ల పాటు ఆయన సర్వీసులో ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 కాగా, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 65 ఏళ్లుగా ఉంది. జస్టిస్ కుమార్ 1962 జూలై 14న జన్మించగా, 2023 జూలైలో 61వ పడిలోకి అడుగుపెట్టారు.