ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా శుభ్‌మన్ గిల్

టీమ్ ఇండియా తరఫున నిలకడగా రాణిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లెయ‌ర్ శుభ్‌మన్ గిల్. మూడు ఫార్మాట్లలోనూ భారీగా పరుగులు సాధించిన వ్య‌క్తిగా రికార్డుల్లో త‌న పేరును లిఖించునున్నాడు. ముఖ్యంగా పోయిన నెల‌ జనవరిలో జ‌రిగిన‌ వన్డే, టీ20 మ్యాచ్ ల‌లో గిల్ చెలరేగిపోయాడు. దీంతో తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అతన్ని వరించింది.
 
పోటీలో నిలిచిన మహ్మద్‌ సిరాజ్‌, కాన్వేలను వెనక్కి నెట్టి మరీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు జనవరి నెల ప్లేయర్‌ అవార్డును ఐసీసీ ప్రకటించింది.  గత నెలలో టీ 20 మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. ఈ నెల 1న న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 మ్యాచులో సెంచరీ సాధించాడు.  ఈ మ్యాచులో 126 పరుగులు చేసి శుభమన్‌ గిల్ నాటౌట్‌గా నిలిచాడు.
ఈ సెంచరీతో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. టీ 20 క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు కావడం మరో విశేషం.
అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌పై విరాట్ కోహ్లీ 122 పరుగులతో నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వరకు ఆరు నెలల కాలంలో వరుసగా ఆరు సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ముంబైలో శ్రీలంకతో జరిగిన తొలి టీ 20లో గిల్ కేవలం 7 పరుగులే చేసినా, ఆ తర్వాత అద్భుత ప్రదర్శన కొనసాగించాడు. మూడో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. దీని తర్వాత మూడు వన్డేల్లో వరుసగా 70, 21, 116 పరుగులు చేశాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.
 
వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా కూడా నిలిచాడు. తదుపరి రెండు ఇన్నింగ్స్‌లలో 40, 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.  శ్రీలంక, న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ ల‌లో భార‌త్ గెలుపుకై గిల్ మంచి కృషి చేశాడు. మొత్తానికి అన్ స్టాప‌బుల్ యాటిట్యూడ్ తో త‌ను బాదిన సెంచ‌రీలు ఇండియన్ టీమ్ కు సిరీస్ లు సాధించి పెట్టింది. మొత్తంగా మూడు సెంచరీలతోపాటు జనవరి నెలలో శుభ్‌మన్ గిల్ 567 రన్స్ చేయడం విశేషం.