మూడేళ్లలో లక్షకుపైగా వేతన జీవులు ఆత్మహత్య

మూడేళ్లలో లక్షకుపైగా రోజువారీ వేతన జీవులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ కూలీలతో పాటు స్వయం ఉపాధి పొందేవారు, చిన్న ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పేర్కొంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దీని గురించి తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) గణాంకాలను ఆయన వెల్లడించారు. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

ఇందులో 66,912 మంది గృహిణులు, 53,661 మంది స్వయం ఉపాధి పొందేవారు, 43,420 మంది చిరుద్యోగులు, 43,385 మంది నిరుద్యోగులు ఉన్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో 31,839 మంది రైతులు, వ్యవసాయ కూలీలతోపాటు 35,950 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.

కాగా, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008 కింద రోజువారీ వేతన కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వీటి ద్వారా జీవిత, సామాజిక భద్రత కల్పించడంతోపాటు ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వికలాంగ రక్షణ, వృద్ధాప్య రక్షణ వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజెజెబివై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎం ఎస్ బి వై) ద్వారా జీవిత బీమా, అంగవైకల్య కవర్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు. 2022 డిసెంబర్ 31 నాటికి 14.82 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకాల కింద నమోదు చేసుకున్నట్లు వివరించారు.