రక్షణ రంగంలో భారత్ అతిపెద్ద భాగస్వామి

నేడు రక్షణ రంగంలో భారత్ అతిపెద్ద భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద విమానాల ప్రదర్శన ఏరో ఇండియా- 2023ను ప్రధాని మోదీ ప్రారంభిస్తూ ఎయిర్ షో భారత శక్తికి నిదర్శనమని వెల్లడించారు. సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

 
విస్తరిస్తున్న భారత సామర్థ్యాలకు ఏరో ఇండియా కార్యక్రమం పెద్ద ఉదాహరణని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యానికి బెంగళూరు ఆకాశం సాక్షిగా మారుతోందని ఏరో ఇండియా షోని కొనియాడారు. ఇందులో దాదాపు 100కు పైగా దేశాలు పొల్గొనటం వల్ల భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని చెప్పవచ్చని పేర్కొన్నారు.
 
“నవ భారత సామర్థ్యాలకు బెంగళూరు గగనతలం సాక్ష్యంగా నిలుస్తోంది. నవ భారతానికి ఆకాశమే హద్దు అని రుజువవుతోంది. ఈ రోజున.. మన దేశం నూతన శిఖరాలను అందుకోవడంతో పాటు దాటుకుని ముందుకు పరుగులు తీస్తోంది” అని ప్రధాని చెప్పారు. “ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. మన ఆత్మవిశ్వాసానికి ఓ పరీక్ష. ఈ ప్రదర్శనలో 100 దేశాలు పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ప్రపంచానికి ఎంతటి నమ్మకం ఉందో స్పష్టమవుతోంది’’ అని ప్రధాని తెలిపారు.
 
ఇందులో భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు చందిన 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏరో షో-2023 గత రికార్డులను బద్దలకొట్టిందని మోదీ తెలిపారు. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలను మనం తయారు చేస్తున్నామని చెబుతూ విదేశాలకు రక్షణరంగ సామాగ్రి ఎగుమతి చేసే దేశంగా మారాలని సూచించారు.ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇక్కడే విమానాలు తయారు చేసుకుంటున్నామని, విదేశాలకు ఎగుమతి చేసే రక్షణ సామాగ్రిని ఆరు రెట్లు పెంచామని ప్రధాని పేర్కొన్నారు. రక్షణరంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేటు సంస్థలను కోరుతున్నామని మోదీ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎన్నో కొత్త పుంతలు తొక్కామని, కేంద్ర బడ్జెట్‌లో వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. భారతీయ రక్షణ రంగంలో పెట్టుబడులకు నిబంధనలు సరళతరం చేశామని చెప్పారు.

ఈ ఎయిర్ షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చైధరి  స్వయంగా యుద్ధ విమానాన్ని నడుపుతూ ‘గురుకుల్’ విన్యాసానికి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా పాల్గొన్నారు.