నేటి నుండి బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు బెంగళూరు సిద్ధమయ్యింది. ‘ది రన్‌వే టూ బిలియన్ ఆపర్చ్యూనిటీస్’ థీమ్‌తో యలహంక వైమానిక కేంద్రంలో ఐదురోజుల పాటు జరిగే ఈ ఎయిర్‌షోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తొలిసారి ఐదు రోజుల పాటు దీనిని నిర్వహిస్తుండగా.. ఇందుకోసం 35 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటుచేయడం విశేషం.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఏరో ఇండియా 2023 మన దేశపు ఉత్పాదక నైపుణ్యాన్ని,  ప్రధానమంత్రి ఊహించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాకారం చేయడంలో సాధించిన పురోగతిని ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఏరోస్పేస్, విమానయాన రంగ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 
సురక్షితమైన,  సుసంపన్నమైన భవిష్యత్తు కోసం `భారత్ లో తయారు’, `ప్రపంచం కోసం తయారు’ (‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’) విజన్‌కి అనుగుణంగా స్వదేశీ పరికరాలు/సాంకేతికతలను ప్రదర్శించడం, విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంపై ఈ సందర్భంగా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
 
మొత్తం 98 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. అలాగే, 32 దేశాల రక్షణ మంత్రులు, 29 దేశాల వైమానిక దళ చీఫ్‌లు, 73 కంపెనీల సీఈఓలతోనూ సమావేశాలు నిర్వహించున్నారు. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొనడం ఇదే తొలిసారి. వీటిల్లో ఎంఎస్‌ఎంఈ, అంకుర సంస్ధలు ఉన్నాయి.
 
కర్ణాటక రికార్డు స్థాయిలో 14వ సారి వైమానిక ప్రదర్శనకు ఆతిథ్యం ఇస్తుండడంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 2021లో కరోనా వైరస్ వ్యాప్తితో ఫ్రాన్స్‌ సైతం వైమానిక ప్రదర్శనను రద్దు చేసుకుంటే వర్చువల్ ద్వారా ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించిన ఘనత కర్ణాటకకే దక్కుతుంది. అదే కేంద్ర రక్షణ శాఖ విశ్వాసాన్ని చూరగొనేలా చేసింది.
 
కరోనా తగ్గుముఖం పట్టి ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడుతుంటంతో ప్రపంచ దేశాల రక్షణ సంస్థలు 14వ వైమానిక ప్రదర్శనపై ఆసక్తి చూపాయి.  ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనన్ని రక్షణ, వైమానిక సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడటంలేదు.
 
ఈ ప్రదర్శన కోసం ఒక రోజు ముందుగానే బెంగళూరు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సోమవారం భారతీయ ఆత్మనిర్భర్‌ సాధనలపై ప్రపంచానికి సందేశం ఇవ్వనున్నారు. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు రోజువారీ ప్రదర్శనలో పాల్గొంటాయి. అమెరికా నేవీకి చెందిన అత్యంత అధునాతన బహుళ సాధన యుద్ధ విమానం సూపర్ హర్నెట్ F/A-18E, F/A-18F‌లు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.
భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వీటిలో ఎయిర్‌బస్‌, బోయింగ్‌, లాక్హీడ్‌, మార్టిన్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, సాబ్‌, సఫ్రాన్‌, సాబ్‌, సఫ్రాన్‌, రోల్స్‌ రాయిస్‌, ఎల్‌ అండ్ టీ, భారత్‌ పోర్జ్‌ లిమిటెడ్‌, హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, బీఈఎంఎల్‌ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.
 
మొత్తం , రూ.75,000 కోట్ల పెట్టుబడుల కోసం భారత, విదేశీ రక్షణ సంస్థలతో 251 ఒప్పందాలను చేసుకోనున్నారు.  కాగా, గత ఐదేళ్లుగా భారత రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల్లో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వాటినే వినియోగించారు. ఆత్మ నిర్భర్‌ నిధులతో రక్షణ రంగం సాధించిన ప్రగతిని ఈ వేదిక ద్వారా ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.