సభా కార్యక్రమాలు రికార్డు చేసిన కాంగ్రెస్‌ ఎంపీ సస్పెండ్

కాంగ్రెస్‌ ఎంపీ రజనీ పాటిల్‌ను రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ప్రకటించారు. సమావేశాలు సోమవారం ముగుస్తాయి. సభా కార్యక్రమాలను రికార్డు చేయడంపై చైర్మన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
సభా కార్యకలాపాలను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంపై తీవ్రంగా రాజ్యసభ చైర్మన్‌ తీవ్రంగా పరిగణించారు. చెడ్డ ప్రవర్తన కారణంగా బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు ఆమెను సస్పెండ్‌ చేసినట్లు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ ప్రకటించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించడంతోపాటు పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.

కాగా, బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రజనీ పాటిల్‌ రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్‌లను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ దీనిపై శుక్రవారం స్పందిస్తూ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇది అనారోగ్యకరమైన చర్య అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ రజనీ పాటిల్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిగతా బడ్జెట్‌ సమావేశాల వరకు ఆమెను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా రజనీ పాటిల్‌ స్పందిస్తూ తాను అలాంటివేమీ చేయలేదరని, అయినా తనకు ‘ఉరిశిక్ష’ విధించారని పేర్కొన్నారు. తాను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, చట్టాలను ఉల్లంఘించడానికి తమ  సంస్కృతి తనను  అనుమతించదని చెప్పారు. రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం ఇస్తుండగా.. అడ్డుకున్నామని, అందుకే ఆగ్రహంతో ఈ చర్య తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

కాగా, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ ప్రతిష్టాత్మకమైన సభలో పార్లమెంట్‌లోని సీనియర్‌ సభ్యులు అనధికారికంగా రికార్డు చేస్తున్న వీడియోలను సోషల్‌ మీడియాలు చూడాల్సి వస్తుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.