స్వామి చిదానంద గిరి హైదరాబాద్ పర్యటన

ఫిబ్రవరి 12 నుంచి హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి భారత పర్యటనలో భాగంగా భాగ్యనగరానికి వస్తున్నారు. ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు హైదరాబాదులో జరగనున్న 5 రోజుల ఆధ్యాత్మిక సంగం కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహిస్తారు.
 
ఈ కార్యక్రమానికి భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలలనుంచి 3500 మంది భక్తులు హాజరౌతారు. సామూహిక ధ్యానాలు, పరమహంస యోగానంద బోధనల ఆధారంగా వైఎస్ఎస్ స్వాములు ఇచ్చే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. వై.ఎస్.ఎస్. వెబ్ సైట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. yssi.org/Sangam2023
 
స్వామి చిదానంద గిరి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలకు అధ్యక్షులు. చిదానందకు అంటే, అనంత దివ్యచైతన్యం (చిత్) ద్వారా పరమానందాన్ని పొందడం. ఆయన 40 సంవత్సరాలకు పైగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసిగా ఉన్నారు. 2009 నుంచి వై.ఎస్.ఎస్, ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.
 
అమెరికా, కెనడా, ఐరోపా, భారతదేశంలో చేసిన పర్యటనలలోనూ, రిట్రీట్ కార్యక్రమాలలోనూ, లాస్ ఏంజిలిస్‌లో జరిగే వార్షిక ఎస్.ఆర్.ఎఫ్. సమావేశాలలోనూ, ఆయన పరమహంస యోగానంద బోధనలు వివరిస్తుంటారు. 
 
స్వామి చిదానంద గిరి తన సన్యాస జీవన ఆరంభం నుంచి మృణాళినీ మాతాజీతో (మాజీ సంఘమాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాల్గవ అధ్యక్షురాలు) సన్నిహితంగా పనిచేశారు. పరమహంస యోగానంద రచనలు, ఇతర వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ ప్రచురణల ఎడిటింగ్‌లోనూ, ప్రచురణలోనూ ఆమెకు సహకరించేవారు. ఆ సమయంలోనే ఆమె వద్ద శిక్షణ పొందారు. 
 
స్వామి చిదానంద గిరికి పరమహంస యోగానంద బోధనలతో మొదటి పరిచయం, ఎన్సినిటాస్, కాలిఫోర్నియాలో (అక్కడ ఎస్.ఆర్.ఎఫ్‌కు ఒక రిట్రీట్, ఆశ్రమ కేంద్రం ఉన్నవి) 1970 ప్రథమార్థంలో జరిగింది. అప్పుడు ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ, ఫిలాసఫీ అధ్యయనం చేస్తున్న విద్యార్థి.
 
1975లో ఆ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన కొన్ని నెలల తరువాత “ఒక యోగి ఆత్మకథ” ప్రతిని ఆయన చూశారు. 1977లో దరఖాస్తు చేసి ఎన్సినిటాస్‌లోని ఎస్.ఆర్.ఎఫ్. ప్రవేశార్థుల ఆశ్రమంలో చేరారు. ప్రవేశార్థిగా తమ శిక్షణను 1979లో పూర్తి చేశాక మౌంట్ వాషింగ్టన్‌లోని ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ ప్రచురణల విభాగంలో సంపాదకీయ కార్యకలాపాలలో నియమితులయ్యారు.
 
స్వామి చిదానంద గిరి ఇంతకు ముందు 2007, 2017, 2019 సంవత్సరాలలో భారతదేశాన్ని సందర్శించారు. 2019లో చేసిన భారతదేశ పర్యటనలో నోయిడా, ముంబై, హైదరాబాదు, రాంచీ, దక్షిణేశ్వరంలో పరమహంస యోగానంద వారి క్రియాయోగ బోధనల గురించి వివరించారు. శాస్త్రీయమైన యోగధ్యాన మార్గాన్వేషకులు వేలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.