టిబెట్‌ చిన్నారులను బలవంతంగాచైనా బోర్డింగ్ స్కూళ్లకు

టిబెట్‌లోని చిన్నారులను చైనా బలవంతంగా బోర్డింగ్ స్కూళ్లకు పంపుతున్నది. మాతృభాషలో కాకుండా వారిని చైనీస్‌ భాషలో బోధిస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు తమ నివేదికలో విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది చిన్నారులను ఇలా చైనా బోర్డింగ్‌ స్కూళ్లకు తరలించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
 
ఇది ముమ్మాటికీ టిబెటన్ల గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నమే అని అంతర్జాతీయ నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  బోర్డింగ్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో చైనా దాదాపు 10 లక్షల మంది టిబెటన్ పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరుచేసింది. ఈ పిల్లలను తమ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బోర్డింగ్ పాఠశాలల్లో చైనా ఉంచింది.
 
ఈ టిబెటన్ పిల్లలు తమ మాతృభాష, సంస్కృతి, చరిత్రను అధ్యయనం చేయకుండా చైనా వారి కుటుంబాల నుంచి దూరంగా ఉంచాలని కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నది. ఈ విషయాలతో కూడిన నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల నిపుణులు సిద్ధం చేశారు. యూఎన్‌ నివేదిక ప్రకారం.. టిబెటన్ చిన్నారులు చైనీస్ భాషలో చదవాల్సి వస్తున్నది. ఈ పిల్లలను ఉంచే పాఠశాలలు చైనాలో మెజార్టీ జాతి సమూహమైన హాన్ సంస్కృతిని మాత్రమే బోధిస్తాయి. అక్కడి జనాభాలో హాన్‌ జాతీయులు 92 శాతం వరకు ఉన్నారు.
టిబెటన్ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధంగా ఉంచుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మాతృభాషను మరచిపోయే అవకాశం ఉన్నది. అలాగే, తమ కుటుంబాలతో సంబంధాలు కొనసాగించడంలో ఇబ్బంది పడవచ్చని నిపుణులు భయపడుతున్నారు.

టిబెటన్ పిల్లలు చైనా భాషలో విద్యాభ్యాసం చేయడం వల్ల భవిష్యత్‌లో తమ గుర్తింపును కోల్పోయే అవకాశం ఉన్నదని నివేదిక సిద్ధం చేసిన నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, తాతలతో ఇకపై సంభాషించే సామర్థ్యాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. టిబెట్ ప్రాంతం లోపల, బయట నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య, వాటిలో చదువుతున్న టిబెటన్‌ చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని విచారం వ్యక్తం చేశారు.