ప్రజల నమ్మకాన్ని కాపాడేలా న్యాయ వ్యవస్థ

ప్రజల నమ్మకాన్ని కాపాడేలా న్యాయ వ్యవస్థ కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సూచించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌తో కలిసి సీజే ప్రారంభించారు.
 
అనంతరం జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయా న్‌ మాట్లాడుతూ.. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెంచేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. తనకు తెలుగు భాషంటే ఎంతో ఇష్టమన్న సీజే.. మాజీ సీఎం ఎన్టీఆర్‌ మాట్లాడే తెలుగు ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని తెలిపారు. కోర్టులలో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటే మరింత చేరువగా న్యాయ వ్యవస్థ పని చేయగలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
 
ముంబై హైకోర్టులో స్థానిక మరాఠీ భాషలో కోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రచురించడం వల్ల అక్కడి ప్రజలకు న్యాయ వ్యవస్థ మరింత దగ్గరైందని తెలిపారు. క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లో స్థానిక భాష ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు, ప్రజలలో నమ్మకం పెరుగుతాయని చెబుతూ భాష కేవలం ఇతరులకు కమ్యూనికేట్ చేసే సాధనం మాత్రమేనని స్పష్టం చేశారు.

పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో 16 వేల 465 కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ న్యాయవ్యవస్థలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి మౌలిక వసతుల మెరుగుదల, నూతన కోర్టుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. న్యాయవాదులు, ప్రజలు సైతం సహకరించాలని ఆయన కోరారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని స్పష్టం చేశారు.

కార్యక్రమం లో రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, పెద్దపల్లి జిల్లా న్యాయమూర్తి నాగరాజు, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రవణ్ కుమార్ తోపాటు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.