ఎల్యేల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణాలో రాజకీయ కలకలం రేపిన ఎమ్మెల్యేల కోకనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది.  కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై చీఫ్‌ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.తుకారాంలతో కూడిన ధర్మసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. ఇక గత మూడు నెలలుగా ఈ కేసు పలుమలుపులు తిరిగింది.

ఏసీబీ నుంచి సుప్రీం కోర్టు దాకా మొత్తం ఆరు కోర్టులు ఈ కేసును పరిశీలించాయి. సిట్ దర్యాప్తుతోనే ఈ కేసులో అన్ని విషయాలు బయటపడతాయని ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు వాదించింది. అయితే.. సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని ప్రతివాదులు పేర్కొన్నారు. సీబీఐతో విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించ వద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

 సిబిఐ దర్యాప్తుకు అనుకూలగా సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయలేమని చెప్పిన హైకోర్టు ధర్మాసనం, కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని అభిప్రాయపడింది.  మరోవైపు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయ స్థానంలో సవాలు చేయనున్నట్లు చెబుతున్నారు. హైకోర్టు తీర్పును 15రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. దానికి హైకోర్టు నిరాకరించింది.