స్టార్టప్‌ల ర్యాంకింగ్స్‌లో15వ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్

స్టార్టప్‌ల ర్యాంకింగ్స్‌లో బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ల తర్వాత 15వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. స్టార్టప్ కంంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, వాటి పనితీరు, విశాఖలో ఐటీ రంగాభివృద్ధిపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో సమాధానమిచ్చారు.
 
2016 సెప్టెంబరులో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటివరకు 86,713 స్టార్టప్‌లను డీపీఐఐటీ గుర్తించిందని తెలిపారు. స్టార్టప్‌ల ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ వెల్లడించడం ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రం ఎంతగా వెనుకబడి ఉందో  వెల్లడించారు.
 
వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన స్టార్టప్‌లు కేవలం 1,341 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న విధానపరమైన చర్యల ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలో ఉందని చెప్పారు. అంటే, దేశంలో విధానపరంగా స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌కు రాష్ట్రప్రభుత్వం నుండి ఎటువంటి మద్దతు లభించడం లేదని చెప్పవచ్చు.
 
2022 డిసెంబర్ 31 నాటికి దేశంలో స్టార్టప్‌ల ద్వారా ప్రత్యక్షంగా 8.92 లక్షల మందికి ఉపాధి లభించగా, అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ రంగంలో 12,557 మాత్రమే ఉద్యోగాల కల్పన జరిగిందని కేంద్రమంత్రి జవాబులో వివరించారు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ స్టార్టప్స్ 2021 సర్వే ఫలితాలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలకు మద్దతివ్వడం ద్వారా యువకులకు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి యువత నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి మోదీ సంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.