11 నెలల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1400 కోట్లు

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వంద కోట్లకు పైబడి ఆదాయం లభిస్తున్నది. దానితో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1400 కోట్ల మార్కును దాటింది. శ్రీనివాసుని దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు శ్రీవారికి భక్తులు సమర్పించే కానులతో టిటిడికి ప్రతినిత్యం 3 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.
 
గతంలో కరోనా కారణంగా రెండేళ్ళు శ్రీవారి దర్శనానికి టిటిడి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో స్వావివారికి హుండీ ఆదాయం కూడా తక్కువగానే లభించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను కరోనాకు పూర్వం ఉన్న విధానంలోనే భక్తులను టిటిడి అనుమతిస్తుండడంతో గతేడాది హుండీ ద్వారా శ్రీవారికి లభిస్తున్న ఆదాయం గణనీయంగా పెరుగుతూవుంది.
 
గత 10 నెలలుగా భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వామివారికి గతేడాది కంటే ఎక్కువ హుండీ లభిస్తుంది. గతంలో ఏడాది రూ. 1200 కోట్ల వరకు హుండీ ఆదాయం లభించేది. సాధారణంగా మే, జూన్‌ మాసంలో మాత్రమే స్వామివారికి లభించే హుండీ ఆదాయం వందకోట్ల మార్కును దాటేది. మిగిలిన మాసాల్లో హుండీ ఆదాయం వంద కోట్లలోపే ఉండేది.
 
కాగా,  ప్రస్తుతం శ్రీవారికి ప్రతినిత్యం సరాసరి రూ. 4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుంది. దీంతో గతేడాది మార్చి నెలలో రూ. 128.61 కోట్ల ఆదాయం లభిస్,తే ఏప్రిల్‌ నెలలో రూ. 127.63 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా మే నెలలో  రూ. 129.93 కోట్ల ఆదాయం, జూన్‌ నెలలో రూ. 123. 76 కోట్ల ఆదాయం, జూలై నెలలో రూ. 139.46 కోట్ల ఆదాయం లభిస్తే ఆగస్టు నెలలో టిటిడి చరిత్రకే అత్యధికంగా రికార్డు స్థాయిలో రూ. 140.7 కోట్ల ఆదాయం లభించింది.
 
సెప్టెంబర్‌లో రూ. 122.69 కోట్లు, అక్టోబర్‌ నెలలో రూ. 122.23 కోట్ల  ఆదాయం లభించింది. నవంబర్‌లో రూ. 127.30 కోట్లు, డిసెంబర్‌ నెలలో రూ. 129.46 కోట్ల ఆదాయం లభించింది. ఇక ఈ ఏడాది జనవరిలో రూ. 123.4 కోట్ల ఆదాయం లభించింది. దీంతో గత 11 నెలల కాలంలో స్వామివారికి దాదాపుగా 1400 కోట్ల ఆదాయం లభించడంతో ఈ సంవత్సరం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1500 కోట్లు మార్కు దాటుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.