గవర్నర్లను వివాదాల్లోకి లాగొద్దు

గవర్నర్లను వివాదాల్లోకి లాగొద్దని, ఆ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హితవు చెప్పారు. గవర్నర్ వ్యవస్థపై నాయకులకు భిన్నమైన ఆలోచనలు ఉంటే పార్లమెంటులో చర్చించి రాజ్యాంగ సవరణ చేయాలని  ఆయన సూచించారు.  విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్లపై వివాదాల గురించి ప్రశ్నించగా, కావాలనే సృష్టిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
గవర్నర్‌లకు పరిపాలనలో జోక్యం చేసుకునే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్‌ విషయంలో కూడా ఏమీ చేయలేరని తెలిపారు. ఏపీలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఇటీవల ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌ను కలిసిన విషయం ప్రస్తావించగా, ఉద్యోగులు ఇచ్చిన వినతిని ప్రభుత్వానికి పంపడం మినహా గవర్నర్‌ ఇందులో చేయగలిగిందేమీ లేదని పేర్కొన్నారు.
 
 ఏ విషయమైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సానుకూల దృక్పథంతో కూర్చుని చర్చించుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని దత్తాత్రేయ సూచించారు. వ్యతిరేక ఆలోచనలతో ఏమీ సాధించలేరని ఈ సందర్భంగా దత్తాత్రేయ స్పష్టం చేశారు.
 
కాగా, విద్యా బోధన మాతృభాషలో జరగాలని, ప్రపంచమంతా ఇదే విధానం అమలవుతోందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. విద్యకు శాస్త్రీయ కోణం, నైపుణ్యం, నైతిక విలువలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
 
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ ఇన్నోవేషన్‌, పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోంద ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రొబోటిక్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ తదితర రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తే…2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని, వాటిలో 50 శాతం భారతీయులే దక్కించుకోవచని దత్తాత్రేయ సూచించారు.
 
ఏ రంగంలో స్థిరపడాలనే విషయం విద్యార్థులు ఇంటర్మీడియట్‌ దశలోనే నిర్ణయించుకోవాలని ఆయన హితవు చెప్పారు.  డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ తీసుకున్నాక నిర్ణయించుకోవడం సరికాదని తెలిపారు.