బడ్జెట్ పై విస్తృత ప్రచారంతో బిజెపి వ్యూహాత్మక అడుగు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2014 ఎన్నికల ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో, ఈ బడ్జెట్ ఒక విధంగా బిజెపి ఎన్నికల ప్రణాలికను తలపించేదిగా ఉంది. అందుకనే అందులోని అంశాల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ఇప్పుడే ప్రారంభించినట్లు అవుతుంది.

బుధవారం మధ్యాహ్నం ఈ దేశవ్యాప్తం ప్రచార కార్యక్రమం ఆరంభం కానుంది. 12 రోజుల పాటు కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరింరించేందుకు బీజేపీ శ్రేణులను పెద్దఎత్తున సమీకరిస్తున్నారు. వీలైన చోట్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇవ్వడం ద్వారా పెద్దఎత్తున ప్రజలకు చేరుకొనేందుకు చూస్తున్నారు.

 
ఈ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా బిజెపి నాయకత్వం నియమించింది. తొమ్మిది మంది సభ్యులు ఉండే ఈ కోఆర్డినేషన్ కమిటీకి బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ సారథ్యం వహిస్తున్నారు.  బ్లాక్, బూత్ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందంటూ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో తెలంగాణ నుండి మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జి వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు.
బీజేపీ అనుబంధ సంస్థల సేవలన్నింటినీ ఈ ప్రచర్మలో వినియోగించుకోనున్నారు. కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, విద్యార్థి విభాగాలు, మండల స్థాయి నాయకులను ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. బడ్జెట్ లో ప్రతిపాదించిన అంశాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా దీన్ని డిజైన్ చేశారు. దానికోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలు, డిజిటల్ క్యాంపెయిన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో కేంద్రం వాటా, నిధుల కేటాయింపు.. వంటి అంశాలను జనంలోకి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ, 2024లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- బడ్జెట్ లో ప్రజల అనుకూల అంశాలకు విస్తృత ప్రచారం కలిగించే ప్రయత్నం చేపట్టారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అయిదోసారి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో మంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు. బ‌డ్జెట్‌ను అయిదుసార్లు ప్ర‌వేశ‌పెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మ‌న్మోహ‌న్ సింగ్‌, అరుణ్ జైట్లీ, పి చిదంబ‌రం ఉన్నారు. 2019 నుంచి నిర్మ‌ల వ‌రుస‌గా బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు.