26 నుంచి హైదరాబాద్ కు విపరీతమైన పొగమంచు!

వాతావరణ మార్పుల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  11 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. జనవరి 26 నుంచి రాత్రివేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి రాత్రిపూట సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో తీవ్రంగా చలి, ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు, ముఖ్యంగా నిత్యకూలీలు వణికిపోతున్నారు.
పొగమంచు కారణంగా ఉదయం, సాయంత్రం ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం​ ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బుధవారం15 డిగ్రీలు, గురువారం 12 డిగ్రీలు, శుక్రవారం 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని నివసించే గిరిజన ప్రజలు చలితో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా మంగళవారం తెల్లవారుజామున ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు మండలంలో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం రాష్ట్రంలోనే అత్యల్పం కావడం గమనార్హం.

అంతేకాకుండా అదే సమయంలో రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమదవ్వడంతో చలి ప్రభావం మరింత పెరిగింది. కాగా నగరంలో మరో నాలుగు రోజుల పాటు- ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.