మార్చి 1 నుంచి హెచ్‌-1బీ వీసా ద‌ర‌ఖాస్తులు!

ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందంటూ టెక్ దిగ్గ‌జాలు, ఇత‌ర కార్పొరేట్‌, మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతున్నాయి. కానీ అమెరికా సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ (యూఎస్సీఐఎస్‌) మాత్రం స్కిల్డ్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం 2024 హెచ్‌-1 బీ వీసా ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్ర‌యి ప్ర‌క‌టించింది. మార్చి 1 నుంచి 17 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని తెలిపింది.
 
ప్రొఫెష‌న‌ల్స్ త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో హెచ్‌-1బీ రిజిస్ట్రేష‌న్ సిస్ట‌మ్‌లో స‌బ్మిట్ చేయాల‌ని సూచించింది.  ఆల్ హెచ్‌-1బీ ద‌ర‌ఖాస్తుదారుల్లో ప్ర‌తి ఒక్క‌రూ విడివిడిగా మైయూఎస్సీఐఎస్ (myUSCIS) ఆన్‌లైన్ అకౌంట్‌ను ఉప‌యోగించాల‌ని తెలిపింది. ప్ర‌తి అభ్య‌ర్థి కూడా 10 డాల‌ర్ల ఫీజు చెల్లించి రిజిస్ట్రేష‌న్ స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.
 
వ‌చ్చేనెల 21 నుంచి యూఎస్ ఎంప్లాయ‌ర్స్‌, ఏజంట్లు కొత్త అకౌంట్‌లు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ద‌ర‌ఖాస్తు దారుల ప్ర‌తినిధులు ఏ స‌మ‌యంలోనైనా త‌మ అకౌంట్స్‌లో ఇత‌ర అప్లికెంట్లు పేర్లు జ‌త చేయొచ్చు.  మార్చి 1 నుంచి ల‌బ్ధిదారుల స‌మాచారం న‌మోదు చేసి, 10 డాల‌ర్ల ఫీజు చెల్లించి రిజిస్ట్రేష‌న్ స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంద‌ని యూఎస్సీఐఎస్ తెలిపింది. సింగిల్ ఆన్‌లైన్ సెష‌న్‌లోనే ఒక‌టికంటే ఎక్కువ ల‌బ్ధిదారుల రిజిస్ట్రేష‌న్ల‌ను వారి ప్ర‌తినిధులు స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

మార్చి 17 నాటికి స‌రిప‌డా రిజిస్ట్రేష‌న్లు వ‌స్తే, వారి పేర్ల‌ను యూఎస్సీఐఎస్ సెలెక్ట్ చేసి మైయూఎస్సీఐఎస్ (myUSCIS) ఆన్‌లైన్ అకౌంట్స్ ద్వారా సెల‌క్ష‌న్ నోటిఫికేష‌న్లు పంపుతుంది. స‌రిప‌డా ద‌ర‌ఖాస్తులు రాని ప‌క్షంలో ప్రారంభ రిజిస్ట్రేష‌న్ పీరియ‌డ్‌లో స‌బ్మిట్ చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను మార్చి 31 వ‌ర‌కు నోటిఫై చేస్తామ‌ని యూఎస్సీఐఎస్ తెలిపింది.

ఈ సీజ‌న్‌లో అభ్య‌ర్థుల‌కు వెసులుబాటు క‌లిగించేలా 2024 ఆర్థిక సంవ‌త్స‌రంలో హెచ్‌-1బీ క్యాప్ సీజ‌న్‌లో రోజువారీగా 24,999.99 నుంచి 39.999.99 డాల‌ర్ల మేర‌కు క్రెడిట్ కార్డు లావాదేవీలు జ‌రిపేందుకు ట్రెజ‌రీ శాఖ అనుమ‌తి ఇచ్చింది. ఐటీ, ఫైనాన్స్‌, ఇంజినీరింగ్ త‌దిత‌ర విభాగాల్లో విదేశీ స్క్రిల్డ్ ప్రొఫెష‌న‌ల్స్ నియామ‌కం కోసం అమెరికా నాన్‌-ఇమ్మిగ్రెంట్ వీసాగా హెచ్‌-1బీ వీసా జారీ చేస్తుంది.

2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో 74 శాతానికి పైగా భార‌తీయ నిపుణులు హెచ్‌-1బీ వీసాలు అందుకున్నారు. యూఎస్సీఐఎస్ ఆమోదించిన‌ 4.07 ల‌క్ష‌ల హెచ్‌-1బీ వీసాల్లో 3.01 ల‌క్ష‌లు భార‌తీయుల‌కు కేటాయించారు. 50 వేల వీసాలు చైనీయుల‌కు ల‌భించాయి.