మహేతిహాసం పుస్తక ఆవిష్కరణ

ప్రముఖ రచయిత, అధ్యయనశీలి ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు రచించిన “మహేతిహాసం ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 26 నాడు భాగ్యనగ‌ర్, ఖైరతాబాద్ లోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన సంవిత్ ప్రకాశన్ సంస్థ 4 వ వార్షికోత్సవం సందర్బంగా ఈ కార్యక్రమం జరిగింది. వసంతి పంచమి నాడు ఆవిర్భవించిన సంవిత్ ప్రకాశన్ ఇప్పటి వరకు సాహిత్య సేవలో భాగంగా దాదాపు 25 పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలలో ప్రచురించింది.

సంవిత్ ప్రకాశన్ వారు సంస్థ పరిచయం, ఉద్దేశం, కృషితో పాటు ప్రారంభం నుంచి నేటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రకాలుగా సహకరించిన రచయితలు, శ్రేయోబిలాషులుతో కలవాలనే ఉద్దేశంతో ఈ ‘స్నేహ మిలన్’ కార్యక్రమన్ని నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ లు శ్రీమతి పరిమళ నడింపల్లి, శైలజ, విద్యాధర్ పాల్గొన్నారు.

ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సమాజం దాదాపు ఒక వేయి సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొని నిలబడ్డదన్నారు. దీని వలన వచ్చిన కొన్ని దుష్పరిణామలను వదిలి వేసి రాబోవు కాలంలో భారతీయ ఆలోచన విధానం, జీవన శైలి అలవరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నల్లిస్ట్ రచయిత రాకా సుధాకర్ మాట్లాడుతూ నేటి సోషల్ మీడియా సమయంలో సైతం సాహిత్యానికి విశేష ఆదరణ ఉందని, అందుకు తగినట్టు పుస్తకాలు ప్రచురించాలని కోరారు.