శిశుమందిర్‌ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం నేడే

జాతీయ భావాలను, దేశభక్తిని పెంపొందిస్తూ, సనాతన సంస్కృతి గురించి విద్యార్థి దశనుంచే బోధిస్తూ రేపటి భావి భారత పౌరులను సన్మార్గంలో నడిపిస్తున్న శ్రీ సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఆదివారం జరుగుతున్నది. హైదరాబాద్‌ బండ్లగూడ జాగీర్‌లోని శారదాధామంలో ఈ మహాసమ్మేళనం జరుగుతుంది.
 
ఇప్పటివరకు లక్షల మంది విద్యార్థులను సంపూర్ణ పౌరులుగా తీర్చి దిద్దాయి. వేలాదిమందిని ఉన్నత శిఖరాలకు ఈ విద్యాలయాలు చేర్చాయి. పలువురిని అత్యున్నతులుగా కూడా తీర్చి దిద్దాయి. దేశ అభ్యున్నతిలో పాలుపంచుకునేలా చేస్తున్నాయి. ఈ విద్యాహోమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సరస్వతీ విద్యాపీఠం పరిధి లో పనిచేస్తున్న శ్రీ సరస్వతీ శిశుమందిరాలు స్వర్ణజయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. విద్యాపీఠంతో పాటు.. శిశుమందిరాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ విద్యాలయం అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారు.
 
మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యాబోధన, పోటీతత్వాన్ని పెంపొందించే కార్యక్రమాల రూపకల్పనలో పూర్వ విద్యార్థి పరిషత్‌ నేతృత్వంలో శిశుమందిర్‌ పూర్వ విద్యార్థులు గణనీయమైన సేవలందిస్తున్నారు. ఇప్పుడు విద్యాపీఠం స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా పూర్వ విద్యార్థి పరిషత్‌ రాష్ట్రస్థాయి మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పరిషత్‌ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌ తెలిపారు.
 
ఈ సమ్మేళనంలో వివిధ రంగాల్లో స్థిరపడిన 2,500 మందికి పైగా పూర్వ విద్యార్థులు, వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించిన దాదాపు 300 మంది పూర్వ ఆచార్యులు పాల్గొంటారని వివరించారు. అలాగే, శిశుమందిర్‌ పాఠశాలలకు చెందిన ప్రస్తుత కమిటీ సభ్యులు సుమారు 400 మంది ఈ పూర్వ విద్యార్థి పరిషత్‌ మహాసమ్మేళనానికి హాజరవుతున్నట్లు వెల్లడించారు.
 
ఈ సమ్మేళనంలో విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి, పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు హరిస్మరణ్ రెడ్డి మార్గదర్శనం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శిశుమందిర్ పూర్వ విద్యార్థులను విద్యా భారతి క్షేత్ర ప్రశైక్షణిక ప్రముఖ్ రావుల సూర్యనారాయణ కోరారు.