5జీ సేవలు నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు వేదికగా మారే అవకాశం!

దేశ మంతటా 5జి నెట్‌వర్క్‌ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోనని పక్షంలో ఈ 5జి స్మగ్లర్లు, ఆర్థికపరమైన నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు వేదికగా మారే అవకాశం ఉందని అధికారులు ఆందోళన ఈ వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు ఐపిఎస్‌ అధికారులు న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల డిజిపి, ఐజిల సమావేశంలో 5జీ నెట్‌వర్క్‌పై ఒక నివేదికను సమర్పించిన్నట్లు తెలుస్తున్నది.

5జీ నెట్‌వర్క్‌ సాయంతో హెచ్‌టీటీపీ, ట్రాన్స్‌పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ వంటి ఇంటర్నెట్‌ ప్రోటోకాల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు సులభంగా యాక్సెస్‌ చేసి వాటి సాంకేతిక వ్యవస్థలలోకి మాల్‌వేర్‌ను పంపి సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ లేదా బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో 5జీ నెట్‌వర్క్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు సందర్భాల్లో సైబర్‌ నేరాలు జరిగిన తీరును గుర్తించడం సంక్లిష్టంగా మారుతుందని తెలిపారు.

మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ మానవ రవాణా, మనీలాండరింగ్‌, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ మధ్య సమాచార మార్పిడికి 5జీ నెట్‌వర్క్‌లోని భద్రత వ్యవస్థ వేదికగా మార్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

5జీ నెట్‌వర్క్‌ ఎన్నో రకాల ఏఐ ఆధారిత ఇంటర్నెట్‌ ఆఫ్‌ దింగ్స్‌ను సపోర్ట్‌ చేస్తుండటంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌, సేవల్లో అంతరాయం కలిగించడం, బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గించడం, సేవలను నెమ్మదింపజేయడం, మాల్‌వేర్‌ ప్రవేశపెట్టడం, సీఎన్‌సీ క్రియేషన్‌, డీఎన్‌ఎస్‌ స్పూఫింగ్‌ వంటి వాటిని సైబర్‌ నేరగాళ్లు సులభంగా చేయగలరని తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ సంస్థలు యూజర్ల విలువైన సమాచారాన్ని అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థలకు అమ్మే సందర్భంలో అవి సంఘవిద్రోహులకు చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.